తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyclone Alert: బంగాళా ఖాతంలో అల్పపీడనం..తుఫానుగా మారే అవకాశం..

Cyclone Alert: బంగాళా ఖాతంలో అల్పపీడనం..తుఫానుగా మారే అవకాశం..

HT Telugu Desk HT Telugu

04 May 2023, 7:02 IST

    • Cyclone Alert:   ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 7న  ఏర్పడే అల్పపీడనం,   8వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. 
మరికొన్ని రోజులు వర్షాలు
మరికొన్ని రోజులు వర్షాలు

మరికొన్ని రోజులు వర్షాలు

Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మే 7వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా రూపాంతరం చెందనుంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 8న తీవ్ర అల్పపీడనంగా మార్పు చెందనుంది. ఆ తర్వాత 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు ఉంటాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో తుఫాను ఏర్పాడనుందనే వార్తలు రైతుల్ని కలవర పెడుతున్నాయి. ఈ సీజన్‌లో తొలి తుపాను ఏర్పడబోతోంది. 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.7వ తేదీన అల్ప పీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడ నుంది. వాయుగుండం మధ్య బంగాళా ఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

అల్పపీడనం ఏర్పడ్డాక తుపాను దిశ, కదలిక, వేగం, తీవ్రత వంటి వాటిని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని భావిస్తున్నారు. కొన్ని సార్లు తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు.

గతంలో పలుమార్లు మే నెలలో తుపానులు ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు రావడాన్ని వాతావరణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వారం రోజుల పాటు వేడి, వడగాడ్పుల నుంచి ఉపశమనం లభించనుంది. కోస్తా ప్రాంతంలో మే నెలలో తుఫానులు ఏర్పడటం సహజమేనని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది బంగాళాఖాతంలో మే మొదటి వారంలో 'అసని' తుపాను ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళలోకి ప్రవేశించడానికి ఇది దోహదపడిందని చెబుతున్నారు. అసని తుఫాను మచిలీపట్నం - నర్సాపురంల మధ్య తీరాన్ని దాటింది. 2021 మే రెండో వారంలో అరేబియా సముద్రంలో 'టౌక్టే' తుపాను, బంగాళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి తోడ్పడిందని గుర్తు చేస్తున్నారు. 2021 మే 23న బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్‌' తుపాను కూడా రుతుపవనాల ఆగమనానికి సహకరించిందని చెబుతున్నారు.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

మరోవైపు భూమిపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అరేబియా సముద్రం వైపు నుంచి గాలులు తోడవడంతో మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మండు వేసవిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో 95.75 మిల్లీ మీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 95.2, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 90.25 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 88.4, ఘంటసాలలో 80.5 పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 80.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 76.75, నిమ్మాడలో71, పల్నాడు జిల్లా కారంపూడిలో 63.6, గుంటూరు జిల్లా మంగళగిరిలో 53.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.