తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hinduja Power : హిందూజా పవర్‌ చెల్లింపులపై సిపిఎం అభ్యంతరం….

Hinduja Power : హిందూజా పవర్‌ చెల్లింపులపై సిపిఎం అభ్యంతరం….

HT Telugu Desk HT Telugu

04 January 2023, 13:36 IST

    • Hinduja Power హిందూజా పవర్ కార్పొరేషన్ కు 1200 కోట్ల రూపాయలు చట్ట విరుద్ధంగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నిస్తోందని  సిపిఎం ఆరోపిస్తోంది.   విద్యుత్ నియంత్రణ మండలి APERC ఆదేశాలకు భిన్నంగా హిందూజా సంస్థకు అదనపు చెల్లింపులకు సిద్ధం కావడాన్ని తప్పు పడుతున్నారు.  విద్యుత్ పంపిణీ  సంస్థలపై ప్రభుత్వ వర్గాల ఒత్తిడి  వల్ల భవిష్యత్తులో విద్యుత్ వినియోగదారులపై 1200 కోట్ల రూపాయలు భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
హిందూజాకు చెల్లింపులపై వామపక్షాల అభ్యంతరం
హిందూజాకు చెల్లింపులపై వామపక్షాల అభ్యంతరం

హిందూజాకు చెల్లింపులపై వామపక్షాల అభ్యంతరం

Hinduja Power ఏపీలో హిందూజా సంస్థకు మేలు చేస్తూ, ప్రజలపై భారం మోపే చట్ట విరుద్ధమైన ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్దేశాలపై జోక్యం చేసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం విజ్ఞప్తి చేసింది. 2020 ఆగస్టు నుండి 2022 ఫిబ్రవరి వరకు హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు చేశాయని, విద్యుత్ నియంత్రణ మండలి యూనిట్ కు 3 రూ. 82 పైసలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని, 2022 ఆగస్టు 1 తేదీన రెగ్యులేటరీ కమిషన్ రూ.3.82 చెల్లింపును ఖరారు చేస్తూ తుది ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

2022 సెప్టెంబర్ లో హిందూజా సంస్థ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నియంత్రణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థల సమాధానాలను కోరిందని, న్యాయపరమైన ప్రక్రియ జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ పై ఒత్తిడి తెచ్చి హిందూజా సంస్థ విజ్ఞప్తి మేరకు 1200 కోట్ల రూపాయలు అదనంగా స్థిర చార్జీలు చెల్లించాలని కోరుతుండటాన్ని తప్పు పట్టారు.

సరఫరా చేసిన విద్యుత్‌కు అదనపు మొత్తం చెల్లించాలని, అదే విధంగా సంస్థ నిర్వహణ సామర్థ్యంకు అనుగుణంగా ఉత్పత్తి చేయకపోయినప్పటికీ, చేసినట్లుగా భావించి దానికి కూడా ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాలని హిందూజా సంస్థ కోరడం అసంబద్ధమైన చర్యగా చెబుతున్నారు. విచారణలో ఉండగా ఛార్జీల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేకమైన చర్య అని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయోజనాలను కాపాడకుండా న్యాయ సలహాదారుల సిఫార్సుల పేరుతో 1200 కోట్ల రూపాయల వరకు స్థిర చార్జీలు హిందూజా సంస్థకు చెల్లించాలని కోరడాన్ని తప్పు పడుతోంది. నియంత్రణ మండలిలో విచారణ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇటువంటి సంకేతాలు ఇవ్వటం చట్టవిరుద్ధం, న్యాయవిరుద్ధమని సిపిఎం చెబుతోంది.

విద్యుత్ నియంత్రణ మండలి కోరినా పంపిణీ సంస్థలు సమాధానం ఇవ్వకుండా వాయిదాలు కోరడం మరింత అనుమానాలకు దారితీస్తున్నదని, రివ్యూ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వ ఉత్తర్వులకు లొంగి, విద్యుత్ పంపిణీ సంస్థలు హిందూజా సంస్థలకు 1200 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ చార్జీలు చెల్లించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంలో నియంత్రణ మండలి తక్షణమే జోక్యం చేసుకొని చట్ట విరుద్ధంగా చెల్లింపులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ భారాలు అధికమయ్యాయని, చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీలు, అదనపు డిపాజిట్లు, సబ్సిడీల కోత ఇలా రకరకాల పేర్లతో ప్రభుత్వం, పంపిణీ సంస్థలు ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నాయని సిపిఎం ఆరోపించింది. హిందూజా సంస్థకు అక్రమంగా మేలు చేసి ప్రజలపై 1200 కోట్ల రూపాయలు అదనపు భారం మోపే ఈ చర్యలను నియంత్రణ మండలి నిలువరించాలని, హిందూజా సంస్థ ఇటీవల ప్రభుత్వము పంపిణీ సంస్థలకు, పవర్ కోఆర్డినేషన్ కమిటీకు పంపిన లేఖలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టాపిక్