తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Idem Kharma : చివరి ఎన్నికలు కాదు…వైసీపీని భూస్థాపితం చేసే వరకు ఉంటా…బాబు

TDP Idem Kharma : చివరి ఎన్నికలు కాదు…వైసీపీని భూస్థాపితం చేసే వరకు ఉంటా…బాబు

HT Telugu Desk HT Telugu

03 December 2022, 6:42 IST

    • TDP Idem Kharma తనకు ఇవి చివరి ఎన్నికలు కాదని, రాష్ట్రంలో వైసీపీని భూస్థాపితం చేసే వరకు పోరాడతానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  ఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ముప్పేనని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  పలు ప్రాంతాల్లో బాబు ఇదేం ఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమంగా భాగంగా  పర్యటిస్తున్నారు. 
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు

TDP Idem Kharma తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాననని...ఇంత నీచమైన సిఎంను ఎక్కడా చూడలేదని, సిఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోవడంరాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనమన్నారు. అమర్ రాజా రూ.9,500 కోట్ల పెట్టుబడి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిందని, అమర్ రాజాకు రాజశేఖర్ రెడ్డి భూమి ఇస్తే ఆయన కొడుకు ఆ కంపెనీని ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. ఎపికి చెందిన వ్యక్తి తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకోవాల్సిన పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు.

ముంపు మండలాలు ఎపికి ఇస్తే తప్ప సిఎంగా ప్రమాణస్వీకారం చేయనని కేంద్రానికి చెబితే, అప్పుడు 7 మండలాలను ఎపిలో కలిపారని, జిల్లా పర్యటనలో పోలవరం ప్రాజెక్టు చూడ్డానికి వెళితే అడ్డుకున్నారని, తాను 22 సార్లు పోలవరంలో పర్యటించానని, 82 సార్లు రివ్యూ చేశానని చెప్పారు. దుర్మార్గపు ముఖ్యమంత్రి పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడని, పోలవరంలో జరిగింది చూస్తే కడుపు రగిలిపోతుందన్నారు.

వైసీపీ సైకోలను భూస్థాపితం చేస్తా….

రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడి చేస్తున్నారని, ఇది తనకు చివరి ఎన్నికలు కాదని వైసిపి సైకోలను భూ స్థాపితం చేసే వరకు ఉంటానని చెప్పారు. రాష్ట్రాన్ని బాగు చేసే వరకు తాను ఉంటానన్నారు. యువత అంతా మీటింగ్ లకు తరలి వస్తున్నారని, వారిలో కసి కనిపిస్తోందన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని పేరు పెడితే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారని, అయితే ఇప్పుడు అదే కరెక్ట్ అని అన్ని వర్గాలు అంగీకరించాయని చెప్పారు.

ఎపికి అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది.. ఆ శని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి శనిలా పట్టిన జగన్ ను వదిలించుకోవాలన్నారు. ఉద్యోగస్తులు అందరినీ బెదిరించాడని, ప్పుడు టీచర్లు ఎన్నికల్లో విధులు చేపట్టకూడదు అని ఉత్తర్వులు తెచ్చాడని విమర్శించారు. తన జీవితంలో ఒకే వర్గానికి పని చేసింది లేదని, మాది అన్ని సామాజికవర్గాల పార్టీ అన్నారు. తెలుగుదేశం అన్ని వర్గాల పార్టీ అని చెప్పారు.

ఏపీలో సిఎం, చీఫ్ సెక్రటరీ, డిజిపి, సలహాదారు సజ్జల..ప్రభుత్వంలో అంతా ఒకటే జిల్లా...ఒకటే వర్గమని ఎద్దేవా చేశారు. నాడు సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు ఇప్పుడు గోడలు దూకుతున్నారని, తప్పు చేసిన వాడు జైల్లో ఉండాలి...కాని ఇప్పుడు తప్పు చేసిన వాళ్లు అధికారంలో ఉన్నారు అదే మన ఖర్మ అన్నారు. సైకోకు అధికారం ఇచ్చి ఇప్పుడు అంతా బాధపడుతున్నారని, నాడు ముద్దులకు పడిపోయారని ఒక్క చాన్స్ అంటే నమ్మి ఇచ్చారన్నారు.

సాయిరెడ్డి ఫోన్ ఎక్కడకు పోయింది….

ఎ2 విజయసాయిరెడ్డి ఫోను పోయిందని ఫిర్యాదు చేశాడని, పోలీసులు ఫోన్ పట్టుకున్నారా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎంపి సాయిరెడ్డి ఫోన్ పోయిందని ఫిర్యాదు ఎందుకు ఇచ్చాడని, ఎలిబీ క్రియేట్ చెయ్యడానికి ముందే ఫోన్ పోయింది అని ఫిర్యాదు చేశాడని, డిజిపి విచారణ చెయ్యవచ్చని, ఫోన్ విషయంలో ఎందుకు విచారణ చేయడం లేదన్నారు.

జగన్‌కు ఓటేస్తే అమరావతి ఉండదని నాడు చెప్పానని, పోలవరం ఆపేస్తాడని చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటారా అన్న సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఏం జరుగుతోందని తాను నాడు చెప్పిందే జరుగుతుంది కదా అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలపై ఏ వర్గం కూడా భయపడాల్సిన పనిలేదని ప్రజల పోరాటాలకు అండగా నిలడబతానన్నారు.