తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp High Command Will Clear Its Stand On Political Alliances In Bhimavaram Executive Meetings

BJP Political alliance : పొత్తులపై బీజేపీ క్లారిటీ అదేనా….?

HT Telugu Desk HT Telugu

23 January 2023, 6:42 IST

    • BJP Political alliance ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ అగ్ర నాయకత్వం క్లారిటీ ఇవ్వబోతోంది. భీమవరంలో జరిగే బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లోనే పొత్తుల చిక్కులపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుక వెళ్లాలనే విషయంలో  భీమవరం సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ క్లారిటీ అదేనా....?
ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ క్లారిటీ అదేనా....? (HT_Print)

ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ క్లారిటీ అదేనా....?

BJP Political alliance ఆంధ్రప్రదేశ్‌‌లో బీజేపీ రాజకీయ పయనం ఎటనే దానిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఏపీలో బీజేపీ స్వీయ అస్తిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్రంలో బీజేపీతో సఖ్యత కోసం తీవ్రంగా శ్రమిస్తుండటంతో బీజేపీ సొంతంగా చేయడానికి పెద్దగా పనేమి లేకుండా పోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. బీజేపీలో రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని కన్నా తర్వాత సోము వీర్రాజుకు అప్పగించారు. అధ్యక్షుల్ని మార్చినా పార్టీలో పెద్దగా మార్పు లేదనే భావన ఉంది.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

మరోవైపు గత రెండు మూడు నెలలుగా ఏపీలో రాజకీయా పరిస్థితులు మారిపోతూ కనిపిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం ఆయన యాత్రపై ఆంక్షలు విధించడంతో విధిలేక విజయవాడ రావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్‌ విజయవాడ వచ్చిన సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హోటల్‌కు వెళ్ళి సంఘీభావాన్ని ప్రకటించారు.

ఆ తర్వాత చంద్రబాబు చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, కుప్పంలో వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి ఘటన నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి పవన్-బాబుల బంధం చిక్కబడుతుందని విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను రెండు పార్టీలు సమర్థించలేదు, ఖండించ లేదు. సమయం వచ్చినపుడు స్పందిస్తామని మాత్రమే చెప్పారు.

ఒంటరిగానే బరిలోకి….?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరయ్యారు. నాటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినా ఎన్నికల తర్వాత పరిణామాలతో వాళ్లను వదిలేసి బీజేపీతో కలిసి ఏపీలో ఎదగాలి అనుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు ప్రధాన పార్టీలకుఅనుబంధంగా ఉండటంతో మూడో వర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించాయి. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గం బీజేపీకి అండగా ఉంటుందని భావించారు. మొదట కన్నాకు బీజేపీ అధ్యక్షబాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత సోముకు ఆ పదవి కట్టబెట్టారు.

దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఏపీలో బీజేపీ సంస్థాగతంగా ఎదగకపోవడానికి పొత్తులే ప్రధాన కారణమని బీజేపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ నీడలో ఉండిపోవడం వల్లే బీజేపీకి సొంతంగా ఒక్క నియోజక వర్గంలో కూడా బలం పెరగలేదనే భావన బీజేపీ పెద్దలకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కనీసం బలమైన ప్రతిపక్షంగా అయినా ఎదగాలని బీజేపీ భావించింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎప్పటికి ఎదగలేమని ఆ పార్టీ భావిస్తోంది. 2024 ఎన్నికల నాటికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని బీజేపీ భావించినా అందులో పిసరంత కూడా పురోగతి సాధించలేకపోయింది.

2019లో ఓటమి తర్వాత పారిశ‌్రామిక వేత్తలుగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు మాత్రమే బీజేపీ సభ్యులయ్యారు. వారికి పదవులు పదిలం కావడం మినహా పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదని బీజేపీ సైతం భావిస్తోంది. ఇటు జనసేన సైతం టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలపై బీజేపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతూనే టీడీపీతో చెలిమికి ఆ పార్టీ చేసే ప్రయత్నాలు బీజేపీకి రుచించడం లేదని తెలుస్తోంది.

భీమవరంలో మంగళవారం జరిగే పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సమావేశాల్లోనే ఈ మీమాంశకు తెర పలకాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ కలిసి పని చేసే విషయంలో బీజేపీ పెద్దలు ఓ స్పష్టతనిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భీమవరం సమావేశానికి బీజేపీ కీలక నాయకుడు బి.ఎల్‌.సంతోష్ వస్తారని ప్రచారం జరిగినా, మురళీధర్ నేతృత్వంలో సమావేశాలు జరుగనున్నాయి. బీజేపీ కార్యాచరణను పార్టీ నేతలకు స్పష్టం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగాలనే బీజేపీ అగ్రనాయకుల ఆలోచనల్ని వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో చెలిమికి దాదాపు అవకాశాలు లేనట్టేనని బీజేపీలోని ఓ వర్గం బలంగా చెబుతోంది.

టాపిక్