తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : బెజవాడ ఇంద్ర‌కీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌.. 10 ముఖ్య‌మైన అంశాలు

Vijayawada : బెజవాడ ఇంద్ర‌కీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌.. 10 ముఖ్య‌మైన అంశాలు

HT Telugu Desk HT Telugu

21 December 2024, 10:10 IST

google News
    • Vijayawada : ఇంద్ర‌కీలాద్రిపై భ‌వానీల దీక్ష‌ల విర‌మ‌ణ నేటీ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 వ‌ర‌కు విర‌మ‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. దీంతో వేలల్లో భ‌క్తులు వ‌స్తార‌ని దేవ‌స్థానం అంచ‌నా వేసింది. చివరి రెండు రోజుల్లో దాదాపు రెండు లక్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచానా వేసింది. 
నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌
నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌

నేటి నుంచి భవానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌

ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిత్య పూజలు నిర్వ‌హించే భ‌వానీలు.. అమ్మ‌వారి దీక్ష‌ల‌ను విర‌మించేందుకు ఇంద్ర‌కీలాద్రికి వ‌స్తారు. నేటి నుంచి భ‌వానీ దీక్ష విర‌మ‌ణ‌లు ప్రారంభ‌ం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. స్నానపుఘాట్లు, గిరి ప్ర‌ద‌క్షిణ మార్గంలో మంచినీటి స‌దుపాయం, క్యూలైన్‌లో వ‌స‌తులు, ఐదు క్యూలైన్ల ద్వారా అమ్మ‌వారి ద‌ర్శ‌నం, ఇరుముడి పాయింట్లు, అమ్మ‌వారి అన్న ప్ర‌సాదం, ల‌డ్డూ ప్ర‌సాదాలు.. ఇలా అన్ని స‌దుపాయాలను దేవ‌స్థానం క‌ల్పిస్తోంది.

10 ముఖ్యమైన అంశాలు..

1. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌వానీల కోసం దేవ‌స్థానం టిక్కెట్ల విక్ర‌యాల‌ను నిలిపివేసింది. ఐదు క్యూ లైన్ల ద్వారా భ‌వానీలు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. ముఖ మండ‌పం, రూ.300, రూ.100 టికెట్ల క్యూలైన్ల‌తో పాటు రెండు స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల భ‌వానీల కోసం అందుబాటులో ఉన్నాయి.

2. భ‌వానీలకు తొలిరోజు ఉద‌యం 6.30 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి ద‌ర్శనం ఉంటుంది. రెండో రోజు నుంచి ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుండి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. కెనాల్ రోడ్డులోని వినాయ‌కుడి గుడి నుంచి మూడు క్యూలైన్లుగా ప్రారంభ‌మై.. ఆల‌య ప్రాంగ‌ణంలోకి చేరే స‌రికి ఐదు క్యూలైన్లుగా మారుతాయి.

3. మ‌హా మండ‌పం దిగువ‌న భ‌వానీలు ఇరుముడుల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించేందుకు ప్ర‌త్యేక స్టాండ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 110 స్టాండ్లు ఏర్పాటు చేశారు. అక్క‌డ‌ గురు భ‌వానీల‌ను మూడు షిప్టులుగా విధులులో ఉంటారు. భ‌వానీల ర‌ద్దీ అధికంగా ఉంటే మ‌రికొన్ని స్టాండ్లు ఏర్పాట్లు చేసేలా దేవ‌స్థానం ఏర్పాట్లు చేస్తోంది.

4. ఈ ఐదు రోజుల పాటు భ‌ద్ర‌త‌కు సంబంధించి పోలీస్ శాఖ‌లో ఎస్పీ స్థాయి అధికారులు 10 మంది, డీఎస్పీ స్థాయి అధికారులు 49 మంది, సీఐలు 145 మంది, ఎస్ఐలు 325 మందితో స‌హా మొత్తం 4,600 మంది పోలీసులు విధులు నిర్వ‌ర్తిస్తారు.

5. శానిటేష‌న్ అధికారులు, సిబ్బంది 650, మూడు వంద‌ల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వ‌ర్తిస్తారు.

6. పున్న‌మిఘాట్, సీత‌మ్మ‌వారి పాదాలు, భ‌వానీ ఘాట్ వ‌ద్ద 850 కేశ‌ఖండ‌న శాల‌లు ఏర్పాటు చేశారు. త‌ల‌నీలాలు తీసేందుకు 850 మంది నాయి బ్రాహ్మ‌ణులను నియ‌మించారు.

7. మొద‌టి మూడు రోజులు ప్ర‌తి రోజు 50 వేల నుంచి ల‌క్ష మంది వ‌ర‌కు భ‌వానీలు వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. అలాగే చివ‌రి రెండు రోజుల్లో మాత్రం రోజుకు ల‌క్ష నుంచి రెండు లక్ష‌ల మంది వ‌ర‌కు భ‌వానీలు వ‌స్తార‌ని దేవ‌స్థానం అంచ‌నా వేసింది.

8. 20 ల‌క్ష‌ల ల‌డ్డూ ప్ర‌సాదం సిద్ధం చేశారు. 14 కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇంద్ర‌కీలాద్రి దిగువున 11, కొండ‌పైన ఒక‌టి, రైల్వేస్టేష‌న్‌, బ‌స్ స్టేష‌న్ వ‌ద్ద ఒక్కొక్క‌టి ఏర్పాటు చేశారు.

9. భ‌వానీలు రాష్ట్ర న‌లుమూలల నుండి, అలాగే పొరుగున తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా విజ‌య‌వాడకు చేరుకుంటారు. అత్య‌ధికంగా బ‌స్సులు, రైళ్ల‌ల‌లోనే విజ‌య‌వాడ‌కు వ‌స్తారు. ప్రైవేటు వెహిక‌ల్స్‌పై వ‌చ్చే భ‌వానీల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండి వైపు నుంచి వ‌చ్చే భ‌వానీలు బీఆర్‌టీఎస్ రోడ్డులో త‌మ వాహ‌నాల‌ను నిలుపుకునే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్, ఖ‌మ్మం, భ‌ద్రాచ‌లం వైపు నుంచి వ‌చ్చే వెహిక‌ల్స్‌ను భ‌వానీ ఘాట్ వ‌ర‌కు అనుమ‌తి ఇస్తారు. రాజీవ్‌గాంధీ పార్క్‌, పున్న‌మీఘాట్‌, భ‌వానీఘాట్‌, బ‌బ్బూరి గ్రౌండ్స్‌, సితారా సెంట‌ర్, లోట‌స్‌, బీఆర్‌టీఎస్ రోడ్డులో వాహ‌నాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

10. భ‌వానీలు కృష్ణాన‌దిలో పుణ్య‌స్నానాలు ఆచ‌రించేందుకు న‌దీ తీరంలో స్నాన‌ఘాట్ల‌ను సిద్ధం చేశారు. వీటిలో సీత‌మ్మ‌వారి పాదాల ఘాట్ కీల‌క‌మైంది. ఈ ఘాట్‌ రైల్వేస్టేష‌న్‌, బ‌స్టాండ్‌ల నుంచి వ‌చ్చే భ‌వానీల‌కే కాకుండా.. అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌రువాత త‌ల‌నీలాల‌ను స‌మ‌ర్పించేందుకు కేశ‌ఖండ‌న‌శాలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఘాట్‌లో దేవ‌స్థానం 500 ష‌వ‌ర్లు అందుబాటులో ఉంచింది. పున్న‌మీ ఘాట్‌లో 200 ష‌వ‌ర్లు, భ‌వానీ ఘాట్‌లో 100 ష‌వ‌ర్లు ఏర్పాటు చేసింది. స్నాన‌ఘాట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రంగా ఉంచేందుకు శానిటేష‌న్ సిబ్బంది కూడా 24 గంట‌ల పాటు అందుబాటులో ఉంటారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం