Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 30 గంటలు
Tirumala Heavy Pilgrim Rush : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భారీగా భక్తులు దర్శనానికి వచ్చారు. శిలా తోరణం వద్దకు క్యూలైన్లు చేరుకుంది.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి.
గురువారం ఉదయం 10 గంటలకు క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.
మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని నమ్మకం. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తుంది.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 5.69 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం కల్పించామని తెలిపారు. 24 లక్షల లడ్డు విక్రయాలు జరిగాయని వెల్లడించారు. స్వామివారికి రూ.20.43 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
సంబంధిత కథనం