TTD Board Meeting : సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌ర్ 5 వరకు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు-here is ttd board meeting key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Board Meeting : సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌ర్ 5 వరకు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు

TTD Board Meeting : సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌ర్ 5 వరకు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు

HT Telugu Desk HT Telugu
Jul 11, 2022 08:23 PM IST

Tirumala Tirupati Devasthanam : రద్దీ తగ్గే వరకూ టోకెన్లు లేకుండానే శ్రీవారి సర్వ దర్శనాలు కొనసాగిస్తామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాలు తిరుమాఢ వీధుల్లోనే నిర్వహిస్తామన్నారుి.

<p>శ్రీవారి బ్రహ్మోత్సవాలు(ఫైల్ ఫొటో)</p>
శ్రీవారి బ్రహ్మోత్సవాలు(ఫైల్ ఫొటో) (TTD)

తాజాగా అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత.. మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు నిర్వహించి భ‌క్తుల‌కు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజరోహణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున సీఎం జగన్ స్వామివారికి ప‌టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలియ‌జేశారు. ఆగ‌స్టు 16 నుంచి 20వ తేదీ వ‌ర‌కు నెల్లూరులో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనానికి వ‌చ్చే భ‌క్తుల‌ను ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా దర్శనానికి పంపే విధానం కొనసాగనున్నట్టుగా తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా దర్శనం చేయించేందుకు ప్రయత్నిస్తున్మాని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తిలో సర్వదర్శనం టైంస్లాట్ కౌంట‌ర్ల ఏర్పాటుకు సంబంధించి స‌మ‌గ్రంగా అధ్యయనం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు..

రూ.154.50 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదం.

రూ.2.07 కోట్లతో తిరుమల పార్వేట మండపం స్థానంలో నూతన మండపం నిర్మాణానికి టెండర్లకు ఆమోదం.

తిరుమ‌ల‌లో అక్టోప‌స్ బేస్‌క్యాంప్‌లో మిగిలి ఉన్న ప‌నుల‌ను రూ.7 కోట్లతో పూర్తి చేయ‌డానికి నిర్ణయం.

రూ7.32 కోట్లతో ఎస్వీ గోశాలలో 10 నెలల కాలానికి గానూ పశువుల దాణా కొనుగోలుకు ఆమోదం.

రూ.2.90 కోట్లతో అమరావతిలోని శ్రీవారి ఆలయం వద్ద పూల‌తోట‌ల పెంప‌కం, పచ్చదనం పెంపొందించేందుకు ఆమోదం.

రూ.18.75 ల‌క్షలతో తిరుమ‌ల‌లోని శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌మూర్తికి రాగి క‌వ‌చాల‌పై బంగారు తాప‌డం ప‌నులు చేప‌ట్టేందుకు ఆమోదం.

తిరుమలలోని ఎస్వీ ప్రాథమిక పాఠశాల, ఎస్వీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ముంబ‌యికి చెందిన సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్టు ముందుకొచ్చింది. ఇక్కడున్న 638 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతోపాటు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఒప్పందం.

2023 సంవత్సరానికి సంబంధించి 8 ర‌కాల క్యాలెండ‌ర్లు, డైరీలు మొత్తం క‌లిపి 33 లక్షల ప్రతులు ముద్రించాల‌ని నిర్ణయం.

సప్తగిరి మాస‌ప‌త్రిక‌ను 5 భాష‌ల్లో నెల‌కు 2.10 ల‌క్షల కాపీలు ముద్రించేందుకు ఆమోదం.

చెన్నైకి చెందిన డాక్టర్ పర్వతం అనే భక్తురాలు తిరువాన్మయూర్, ఉత్తాండి ప్రాంతాల్లో రూ.6 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లను శ్రీవారికి కానుకగా అందించాలని ముందుకు రాగా వాటిని స్వీకరించేందుకు ఆమోదం.

అమెరికాకు చెందిన డా. రామ‌నాథం గుహ బెంగ‌ళూరులోని డాల‌ర్స్ కాల‌నీలో ఉన్న రూ.3.23 కోట్ల విలువ‌చేసే అపార్ట్‌మెంట్‌ను స్వామివారికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విరాళాన్ని స్వీక‌రించ‌డానికి ఆమోదం.

రూ.4.42 కోట్లతో స్విమ్స్‌లో రోగుల, డాక్టర్లు, ఇత‌ర అన్ని వివ‌రాల‌ను నిక్షిప్తం చేసేలా ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు టెండ‌ర్లు.

తిరుమ‌ల బూందీపోటు ఆధునీక‌ర‌ణ కోసం ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంపై అధ్యయానం చేయాలని అధికారులకు ఆదేశం.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా 12 ర‌కాల ఉత్పత్తులు కొనుగోలుకు నిర్ణయం. ధ‌ర‌ల ఖ‌రారుకు మార్క్‌ఫెడ్ అధికారుల‌తో అవ‌గాహ‌న.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ఆనంద‌నిల‌యం బంగారు తాప‌డం ప‌నుల‌పై ఆగ‌మ‌పండితుల‌తో చ‌ర్చించి నిర్ణయం.

Whats_app_banner