తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Si Prelims Exam 2023: ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్.. ఎంత మంది హాజరయ్యారంటే.. ?

AP SI Prelims Exam 2023: ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్.. ఎంత మంది హాజరయ్యారంటే.. ?

HT Telugu Desk HT Telugu

19 February 2023, 20:46 IST

    • AP SI Prelims Exam 2023: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హాజరుశాతం 88 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 20న ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు.
ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్
ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్

AP SI Prelims Exam 2023: ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 19న) నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్... రాష్ట్రవ్యాప్తంగా 291 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించింది. ఉదయం మొదటి పేపర్, మధ్యాహ్నం రెండో పేపర్ పరీక్ష నిర్వహించగా... 88 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ కు హాజరయ్యారు. 1,71, 963 మంది ఎస్ఐ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,243 మంది అభ్యర్థులు ప్రాథమిక పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రారంభం అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 20న ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు... ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 411 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ పడుతున్నారు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. ప్రాథమిక పరీక్షలో... అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడిగారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఇచ్చారు. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకి శారీరక ధృఢత్వ పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో శారీరక ధృడత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారినే మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి... పురుష, మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా 1600 మీటర్ల పరుగులో క్యాలిఫై కావాల్సి ఉంటుంది. వంద మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లలో ఏదో ఒకదాంట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్ ఎస్ఐ పోస్టులకు అన్ని ఈవెంట్లలలో.. అంటే 1600 మీటర్లు.. 100 మీటర్లు.. లాంగ్ జంప్ లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.

1600 మీటర్ల పరుగు పూర్తి చేయడానికి ... పురుషులకి 8 నిమిషాలు, మహిళా అభ్యర్థులకి 10 నిమిషాల 30 సెకండ్ల సమయం ఉంటుంది. 100 మీటర్ల పరుగుని పురుషులు 15 సెకండ్లు... మహిళలు 18 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులకి లాంగ్ జంప్ 3.80 మీటర్లు కాగా... మహిళా అభ్యర్థులకి 2.75 మీటర్లు. ఈ ఈవెంట్లలో ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.