AP Marriage Certificate : మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి? ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలు ఇవే
12 August 2024, 13:39 IST
- AP Marriage Certificate : ఏపీలో కొత్త జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్లను ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల్లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి, వివాహ నమోదు ప్రక్రియ వివరాలు తెలుసుకుందాం.
ఏపీలో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి? ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలు ఇవే
AP Marriage Certificate : ఏపీలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేషన్ కార్డుల జారీకి మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకోనున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. భారతదేశంలో హిందూ వివాహ చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ నమోదు జరుగుతుంది. వివాహాలను చట్టబద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు 2006లో వివాహ నమోదును తప్పనిసరి చేసింది. వివాహ నమోదును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లైన్ విధానం
సాధారణంగా హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్ చేస్తారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తుకు వివాహ ఫొటో, పెళ్లి కార్డు, పెళ్లికొడుకు, పెళ్లి కూతురు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫారమ్ పూర్తి చేసి అందించాలి. ఆ ఫారమ్ ను సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పుస్తకంలో నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేసి దానిపై సంతకం చేసి ఇస్తారు.
కావాల్సిన వివరాలు
- భార్యాభర్తల పూర్తి పేర్లు
-మతం, కులం వివరాలు
-వివాహం చేసుకునే వయస్సు నిర్థారణ సర్టిఫికేట్లు
- వృత్తి, శాశ్వత చిరునామా వివరాలు
- పుట్టిన తేదీ నిర్థారణ సర్టిఫికేట్లు
-వివాహం జరిగిన ఊరు, మండలం, జిల్లా వివరాలు,
- వివాహ తేదీ
- భార్యాభర్తల తల్లిదండ్రుల పేర్లు
- సాక్షులు, వారి చిరునామా
మ్యారేజ్ సర్టిఫికేట్ పొందేందుకు ఆన్ లైన్ విధానం
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇద్దరు వ్యక్తుల సంబంధాన్ని తెలియజేసే చట్టపరమైన పత్రం. ఆన్‌లైన్ లో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం వివాహ రిజిస్టేషన్లు సులభతరం చేసేందుకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కు ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఆన్ లైన్ నమోదు ప్రక్రియ
-ముందుగా https://cdma.ap.gov.in/en/marriageregistration వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
-హోంపేజీలో 'న్యూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్' లో జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీ వివరాలు నమోదు చేయాలి.
-మెమోరాండం ఆఫ్ మ్యారేజ్(ఫారమ్-బి)లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పూర్తి వివరాలు నమోదు చేయాలి.
-పెళ్లికూతురు, పెళ్లికొడుకు...చెరో ఇద్దరు సాక్షుల వివరాలు నమోదు చేయాలి.
-చెక్ లిస్ట్ లో పెళ్లి కార్డు, మెమోరాండం ఆఫ్ మ్యారేజ్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరి గుర్తింపు పత్రాలు, వయస్సు నిర్థారణ సర్టిఫికేట్లు, చిరునామా నిర్థారణ సర్టిఫికేట్లు, ఆధార్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- ఈ విధానం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలలో అమలు చేస్తున్నారు.
-మీసేవలో కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపి, అన్ని పత్రాలు అందిస్తే...మీ సేవ ద్వారా పెళ్లి సర్టిఫికేట్ అందిస్తారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఇలా కూడా?
వివాహ నమోదు అధికారిక వెబ్ సైట్ www.registrations.ap.gov.in లో మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేయాలి. పెళ్లికొడుకు, పెళ్లికూతురి ఆధార్ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్ అందజేస్తే, దానిని పరిశీలించి సాక్షుల సంతకాల అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. హిందూ వివాహ ప్రకారం కాకుండా జరిగిన వివాహలను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. వాటికి కూడా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి www.registrations.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. అయితే ప్రత్యేక వివాహానికి ఒక నెల నోటీసు పీరియడ్ ఉంటుంది. నెల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దానిపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసు పెడుతుంది. పెళ్లికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొన్ని ప్రభుత్వ వెబ్ సైట్లు తాత్కాలికంగా పనిచేయడంలేదు.