Marriage: వివాహంలో అడ్డంకులు అధిగమించేందుకు శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటించండి
06 August 2024, 9:59 IST
- Marriage: వివాహం అనుకున్నప్పటి నుంచి ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతున్నాయా? ప్రేమ వివాహానికి అడ్డంకులు వస్తున్నాయా? అయితే ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటించి చూడండి.
శ్రావణ మాసం శివపార్వతుల పూజ
Marriage: పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పాలు, నీరు, పువ్వులు, గంగాజలం వంటివి సమర్పిస్తూ అభిషేకాలు నిర్వహిస్తారు. పెళ్ళికాని స్త్రీలు ఆదర్శవంతమైన భాగస్వామి రావాలని కోరుకుంటూ శివుని ఆశీర్వాదాలు కోసం పూజలు చేస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
శ్రావణ మాసంలోనే పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందేళ్లకు కఠోర తపస్సు చేసిందని అందుకే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనదని స్వయంగా పరమేశ్వరుడే చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే పెళ్లి కానీ కన్యలు ఈ మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల నచ్చిన వరుడితో వివాహం నిశ్చయం అవుతుందని చెబుతారు.
తరచూ వివాహంలో ఆటంకాలు ఎదురుకావడం, ప్రేమ వివాహానికి అడ్డంకులు ఎక్కువగా వస్తున్నాయా? అయితే శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించి కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, కోరుకున్న భాగస్వామి పొందాలనుకునే వాళ్ళు ఈ పరిహారాలు పాటించడం ఉత్తమం.
వివాహంలో ఆటంకాలు తొలగించుకునేందుకు
వివాహం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడి ఆలస్యం అవుతున్నట్లయితే ఈ పరిహారం పాటించడం మంచిది. సోమవారం వ్రతం ఆచరించాలి. వరుసగా 16 సోమవారాలు ఉపవాసం పాటించాలి. అలాగే శివలింగానికి పవిత్ర జలాన్ని సమర్పించి శివపార్వతులను పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది. మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతాడు. సకాలంలో విజయవంతంగా వివాహం జరుగుతుంది.
వివాహంలో అడ్డంకులు అధిగమించేందుకు ఈ సింపుల్ రెమిడి ఉపయోగపడుతుంది. చిటికెడు పసుపు పొడిని మీ స్నానం నీటిలో కలపాలి. ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. సకాలంలో వివాహానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రతిరోజు నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం పూయడం వల్ల సానుకూల శక్తులు ఆకర్షించడంలో వివాహ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.
కోరుకున్న వ్యక్తితో పెళ్లి
వివాహంలో అంతరాయాలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఆవుకి ఆహారం ఇవ్వడం సులభమైన పరిష్కారం. గోమాతకు క్రమం తప్పకుండా ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరలు అందించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి. సకాలంలో వివాహం జరుగుతుంది. ఆవు పట్ల మీరు చూపించే దయ, కరుణ సానుకూల శక్తిని తీసుకొస్తుంది. వివాహ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.
అలాగే గౌరీదేవిని పూజించాలి. గౌరీ శంకర మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కోరుకున్న భాగస్వామితో వివాహం జరుగుతుంది. అలాగే జాతకంలో మంగళ దోషం ఉన్నవారికి ఈ మంత్రం చాలా గొప్పగా పనిచేస్తుంది. గౌరీ శంకర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల సరైన సమయానికి వివాహం అవుతుంది. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి లభిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.