Marriage : కన్యాదానం సినిమా రిపీట్.. భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
07 August 2024, 6:38 IST
- Bihar : ఓ మహిళ పెళ్లైన తర్వాత కూడా ప్రియుడితో బంధాన్ని కంటిన్యూ చేసింది. దీంతో తన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు భర్త. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
తెలుగులో కన్యాదానం అనే సినిమా చాలా మందే చూసి ఉంటారు. హీరో తన భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్లిద్దరూ అంతకుముందు ప్రేమించుకున్నట్టుగా తెలియడంతో కన్యాదానం చేస్తాడు. అయితే ఇలాంటి ఘటనే బీహార్‌లో జరిగింది. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి సహాయం చేశాడు. లఖిసరాయ్ జిల్లాలోని రామ్‌నగర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. హాట్ టాపిక్‌గా మారింది.
ఖుష్బూ కుమారి (22), రాజేష్ కుమార్ (26) 2021లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత దంపతులు ఇద్దరు బాగానే ఉన్నారు. వీరికి సంతానం కూడా కలిగింది. తల్లి అయిన తర్వాత కూడా ఖుష్బూ తన ప్రియుడు చందన్‌తో పరిచయాన్ని కొనసాగించింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
అయితే ఒక రోజు ఖుష్బూ అత్తమామలు చందన్‌తో ఆమె కలిసి ఉండటాన్ని చూశారు. అది కూడా ఆమె ఇంటికే అర్ధరాత్రి పిలిపించుకుంది. ప్రియుడితో కోడలు ఉన్న విషయాన్ని చూసిన అత్తామామ.. కొడుకుకు చెప్పారు. దీంతో రాజేష్ విషయాన్ని తెలుసుకుని చందన్‌తో తన భార్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.
'ఇద్దరూ గాఢంగా ప్రేమలో ఉన్నారు. తరచుగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకురావడానికి నేను నా భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేశాను. వారు కలిసి ఉండటానికి సహాయం చేశాను. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.' అని రాజేష్ చెప్పాడు.
వీరి వివాహం స్థానిక ఆలయంలో జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా రాజేష్ తన రెండేళ్ల కుమారుడి వద్దే ఉండాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి అయిన వెంటనే ఖుష్బూ రాజేష్‌కి కృతజ్ఞతలు తెలిపింది. 'నా బాయ్‌ఫ్రెండ్‌తో నా పెళ్లికి అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను నా కొత్త భర్తతో ఉంటాను.' అని చెప్పింది.
గతంలోనూ బీహార్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బీహార్‌లో ఒక వ్యక్తి తన అత్తగారిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని అధికారికం చేయడానికి కోర్టు వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన సికందర్ యాదవ్ (45) తన భార్య మరణంతో అత్తమామలతో ఉన్నాడు. ఈ సమయంలో అతను తన అత్తగారు గీతాదేవి(55) మనసు పారేసుకున్నాడు.
గీతాదేవి భర్త దిలేశ్వర్ దర్వే వారి సన్నిహిత సంబంధాన్ని తెలుసుకున్నాడు. ఆందోళన చెందాడు. ఒకరోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.