TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హతలు ఇవే, కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు!
TG Ration Cards : తెల్ల రేషన్ కార్డుల జారీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీకి సక్సేనా సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటామని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. రేషన్ కార్డుల జారీకి అర్హతలను ప్రతిపాదించింది.
TG Ration Cards : రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలను తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డుల పంపిణీ విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.
సక్సేనా సిఫార్సుల మేరకు
రేషన్ కార్డులు జారీపై అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు తీసుకోవాలని కేబినెట్ ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి సూచనలు తీసుకోవాలని యోచిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సక్సేనా కమిటీ సిఫార్సులను తెల్ల రేషన్ కార్డుల జారీలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయన్నారు. 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గ్రెయిన్ ఏటీఎంలు?
రేషన్ పంపిణీలో సరికొత్త సేవలను అమలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగత్మకంగా ప్రారంభించే యోచనలో ఉంది. ముందుగా వీటిని హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ గ్రెయిన్ ఏటీఎంలతో వలసదారుల కష్టాలు తీరుతాయి. వీటి ద్వారా లబ్దిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 24 గంటల పాటు 365 రోజుల పాటు రేషన్ పొందవచ్చు. ఇది ఒక ఏటీఎం మాదిరిగా పని చేస్తుంది. సాధారణ లబ్దిదారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు వీటి ద్వారా రేషన్ పొందవచ్చు. ముఖ్యంగా నగరంలో వలసదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రయోగత్మకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఈ గ్రెయిన్ ఏటీఎంను దేశంలోనే తొలిసారిగా(ఆగస్టు 09, 2024) ఒడిశాలో ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీన్ పై ఎంట్రీ చేయాలి. ఆ తరువాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు. ఇది విజయవంతమైతే ఒడిశాలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ఈ విధానం ద్వారా రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. తెలంగాణే కాకుండా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి.
సంబంధిత కథనం