AP Inter Tatkal: నేడూ, రేపు ఏపీ ఇంటర్ తత్కాల్ ఫీజులు చెల్లించొచ్చు.. జిల్లా కేంద్రాల్లోనే తత్కాల్ పరీక్షల నిర్వహణ
09 May 2024, 9:52 IST
- AP Inter Tatkal: ఏపీ ఇంటర్మీడియట్ తత్కాల్ స్కీమ్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు మే 9, 10తేదీలలో అవకాశం కల్పించారు. తత్కాల్‌లో నమోదు చేసుకున్న విద్యార్ధులు జిల్లా కేంద్రాల్లో మాత్రమే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
నేడు, రేపు ఇంటర్ తత్కాల్ ఫీజులు కట్టొచ్చని బోర్డు ప్రకటన
AP Inter Tatkal: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఇప్పటి వరకు నమోదు చేసుకోని విద్యార్ధులు మే 9,10 తేదీల్లో తత్కాల్ ఫీజును చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ వివి.సుబ్బారావు తెలిపారు.
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా విద్యార్ధులు అనివార్య కారణాలతో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజుల్ని చెల్లించలేకపోతే వారు తత్కాల్ స్కీమ్‌లో పరీక్షలకు హాజరు కావొచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. తత్కాల్ స్కీమ్‌లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు రూ.3వేల రుపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్ధులతో పాటు ఒకేషనల్ విద్యార్ధులు కూడా మే 2024 అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు తత్కాల్ విధానంలో హాజరు కావొచ్చు మే 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫీజులు చెల్లించవచ్చు.
తత్కాల్ స్కీమ్‌లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు సంబంధిత జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
పూర్తైన సప్లిమెంటరీ ఫీజు గడువు…
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు, కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ IPASE పరీక్ష ఫీజును మే1 వరకు స్వీకరించారు.
ఇంటర్ Advance Supplementary సప్లిమెంటరీ ఫీజు Fee Payment చెల్లింపుకు మొదట ప్రకటించిన గడువును కళాశాలల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గతంలో పొడిగించారు. ఏప్రిల్ 22న ఫలితాలు వెలువడిన వెంటనే రెండు రోజుల్ల సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు ప్రకటించింది. గడువు తక్కువగా ఉండటంతో చివరి తేదీని ఏప్రిల్ 30వరకు పొడిగించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలతో పాటు సెలవులు కావడంతో పలువురు విద్యార్ధులు ఫీజులు చెల్లించలేదు. కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు కొంత మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదని గడువు పొడిగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి.
విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ లో పరీక్ష ఫీజు చెల్లింపు సమయాన్ని మే 1వరకు పొడిగించారు. ఇంటర్ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు ఆన్‌లైన్ చెల్లింపు విధానంలో పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా బోర్డు సైట్‌లో ఫీజులు చెల్లించవచ్చు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్..
మే 24 నుంచి జూన్ 1వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్ని రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉదయం పూట ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం ఉదయం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. 25వ తేదీ శనివారం ఇంగ్లీష్ పేపర్ 1, 27వ తేదీ సోమవారం పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటరీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి.
ఏప్రిల్ 28వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. 29వ తేదీ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. 30వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.
31 వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బైపిసి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష ఉంటుంది. జూన్ 1వ తేదీన మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.
ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను జూన్ 6న, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ జూన్ 7న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షల్ని మే 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల టైమ్ టేబుల్ విడిగా ప్రకటిస్తారని బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.
ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు...
ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. 25వ తేదీ శనివారం ఇంగ్లీష్ పేపర్ 2, 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటరీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి.
ఏప్రిల్ 28వ తేదీ మధ్యాహ్నం మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 29వ తేదీ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 30వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు ఉంటాయి.
31 వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపిసి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. జూన్ 1వ తేదీన మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు సెకండియర్ విద్యార్ధులకు ఉంటాయి.