AP Inter Results: ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్…ఏప్రిల్ రెండో వారంలోనే విడుదల.. పూర్తైన మూల్యాంకనం-ap inter results are coming released in second week of april valuation completed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Results: ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్…ఏప్రిల్ రెండో వారంలోనే విడుదల.. పూర్తైన మూల్యాంకనం

AP Inter Results: ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్…ఏప్రిల్ రెండో వారంలోనే విడుదల.. పూర్తైన మూల్యాంకనం

Sarath chandra.B HT Telugu

AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తైంది. దీంతో మరో వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సిద్ధం అవుతోంది.

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్ (Image credit- Pixabay )

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాల Inter Resultsపై విద్యాశాఖ కీలక అప్టేడ్ ఇచ్చింది. ఓ వైపు ఎన్నికల Elections హడావుడి, మరోవైపు విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తుండటంతో ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఏప్రిల్ 12-15 April 12-15 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇంటర్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా సార్వత్రిక ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో విధాన పరమైన నిర్ణయాలన్నీ ఈసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఫలితాల వెల్లడిపై ఈసీ అమోదంతో తేదీని ఖరారు చేయనున్నారు. గతంలో మాదిరి ఇంటర్ ఫలితాల విడుదలలో రాజకీయ నాయకులు ప్రమేయం ఏమి ఉండదు. బోర్డు ఉన్నతాధికారులే వాటిని విడుదల చేస్తారు.

ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించారు. మొదట ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఆ వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్‌లో మొదటి ఏడాది, రెండో ఏడాది కలిపి మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు.ఇంటర్ విద్యార్ధుల జవాబుపత్రాల మూల్యాంకనం కోసం 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు నియమించింది. బుధవారంతో ఇంటర్ స్పాట్‌ వాల్యూయేషన్ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాలను కంప్యూటర్లలో డేటా ఎంట్రీ పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

పదో తరగతి ఫలితాలు…

ఏపీలో పదో తరగతి SSC Results పరీక్షలను 6,30,633 మంది విద్యార్ధులు రాశారు. ప్రస్తుతం పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌ రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యూయేషన్‌ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించారు. గతంలో వాల్యూయేషన్‌లో రకరకాల సమస్యలు తలెత్తడంతో ఈ ఏడాది ప్రతి కేంద్రంలో గరిష్టంగా 900 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

గతేడాది కంటే ముందే విడుదల…

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్‌ 26న విడుదల చేశారు. మే 6న పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం గురువారంతో మూల్యాంకనం పూర్తి కావాల్సి ఉన్నా ముందే జవాబు పత్రాల మూల్యాంకనం కొలిక్కి వచ్చింది. నేడు జవాబు పత్రాల వెరిఫికేషన్‌, డేటా ఎంట్రీ వంటి పనులను ప్రారంభిస్తారు.

ఏప్రిల్ 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్‌ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ ఒకటిన ప్రారంభించిన పదో తరగతి మూల్యాంకనం కూడా ఎనిమిదో తేదీతో పూర్తి చేస్తారు. వాటిని కూడా మూల్యాంకనం పూర్తైన వారంపదిరోజుల్లోనే విడుదల చేస్తారు. ఏప్రిల్ 20లోపే పదో తరగతి ఫలితాలు వస్తాయని సెకండరీ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తారు.

సంబంధిత కథనం