Inter Campaign : ఏపీలో ఇంటర్మీడియట్‌ ర్యాంకులు, మార్కుల ప్రచారంపై నిషేధం....-andhra pradesh prohibits on publicity and campaigning of inter marks and ranks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Inter Campaign : ఏపీలో ఇంటర్మీడియట్‌ ర్యాంకులు, మార్కుల ప్రచారంపై నిషేధం....

Inter Campaign : ఏపీలో ఇంటర్మీడియట్‌ ర్యాంకులు, మార్కుల ప్రచారంపై నిషేధం....

HT Telugu Desk HT Telugu
Jul 30, 2022 07:41 PM IST

ఇంటర్మీడియట్‌ ర్యాంకుల ప్రచారానికి ఏపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పత్రికలు, టీవీల్లో హోరెత్తించే ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఏ రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవంటూ జీవో నంబర్ 119జారీ చేసింది.

<p>ప్రైవేట్ ఇంటర్‌ కాలేజీల ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం</p>
ప్రైవేట్ ఇంటర్‌ కాలేజీల ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా పత్రికలు, టీవీల్లో సందడి కనిపించడం లేకపోవడం వెనుక ప్రభుత్వం ఆంక్షల్ని కఠినంగా అమలు చేయడమే కారణం. గతంలో ఉన్న నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి.

విద్యా రంగంలో సంస్కరణలతో పాటు విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించడం, తల్లిదండ్రులను ప్రలోభ పెట్టి అడ్మిషన్లు ఇవ్వడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 119 విడుదల చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఎవరైనా మెరుగైన ఫలితాలను సాధిస్తామని హామీలివ్వడం, విద్యార్ధులను మంచి మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ప్రకటనలు ఇవ్వడం, ముందే అడ్మిషన్లను చేపట్టడం వంటి చర్యలపై కఠిన ఆంక్షలు విధించారు.

1997లో జారీ చేసిన జీవో నంబర్ 114తో పాటు 2018, 2020లో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్స్‌లో పేర్కొన్న నిబంధనల్ని స్పష్టంగా అమలు చేయాలని ఆదేవించింది. 2020 గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ర్యాంకుల వివరాలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో హోరెత్తించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 1997 నాటి ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ చట్టంలోని మాల్‌ప్రాక్టీస్‌, అనైతిక చర్యల నిరోధక చట్ట ప్రకారం ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రకటనలు ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం విద్యార్ధులకు వచ్చిన మార్కులు, ర్యాంకులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిసస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించి ఇంటర్మీడియట్ విషయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు శిక్షార్హలవుతారని స్పష్టం చేశారు.

బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఆదేశాలను కాలేజీలు పెద్దగా ఖాతరు చేయకపోవడం, బోర్డు కూడా గతంలో చూసి చూడనట్లు వదిలేయడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ కాలేజీలలో మార్కులు, ర్యాంకుల ప్రకటనలు, ప్రచారాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరితో ఇంటర్మీడియట్ కాలేజీలు దిక్కుతోచని స్థితిలోపడిపోయాయి. ఎడాపెడా అడ్మిషన్లు తీసుకోవడం, ప్రకటనలు హోరెత్తించడం కుదరకపోవడంతో కిందామీద పడుతున్నారు.

Whats_app_banner