తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Announces Aarogyasri Scheme Tiffa Scanning Free For Pregnant Ladies

TIFFA Scanning In Aarogyasri : గర్భిణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆరోగ్య శ్రీలో ఉచితంగా టిఫా స్కానింగ్

14 May 2023, 10:16 IST

    • TIFFA Scanning In Aarogyasri : ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో టిఫా స్కానింగ్, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ లను జోడించింది. గర్భిణులు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా టిఫా స్కానింగ్ చేయించుకోవచ్చు.
ఆరోగ్య శ్రీలో టిఫా స్కానింగ్
ఆరోగ్య శ్రీలో టిఫా స్కానింగ్ (Pixabay )

ఆరోగ్య శ్రీలో టిఫా స్కానింగ్

TIFFA Scanning In Aarogyasri : గర్భిణులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గర్భిణులకు టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ (TIFFA) స్కానింగ్‌ సేవలను ఉచితంగా అందించనుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు టిఫా స్కానింగ్ ను ఉచితంగా అందించనున్నారు. టిఫా స్కానింగ్ లో తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తిస్తారు వైద్యులు. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

టిఫా స్కానింగ్ తో డెలివరీ విధానంపై అంచనా

సాధారణంగా టీఫా స్కాన్ తో గర్భస్త శిశువు పరిస్థితిని వైద్యులు అంచనా వేస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే తెలియజేస్తారు. మేనరికపు వివాహాలు చేసుకున్న వారికి, గర్భం వచ్చిన రోజు నుంచి వివిధ సమస్యలున్న వారికి, క్రోమోజోమ్స్, మెంటల్‌ డిజెబిలిటీ, సింగిల్‌ జీన్‌ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారిలో ఉండే సమస్యలు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి లోపాలను టిఫా స్కానింగ్ లో ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు గుర్తిస్తే వైద్యులు అందుకు తగిన విధంగా చికిత్స అందిస్తారు. అదే విధంగా గర్భంలో శిశువు ఏ పొజిషన్‌లో ఉందో తెలుసుకునేందుకు ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది. ప్లాసెంటా ఎక్కడ ఉంది, ఉమ్మ నీరు పరిస్థితి ఏంటి? శిశువులో ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే ఈ స్కానింగ్ లో గుర్తిస్తారు. దీంతో ఆయా లోపాలను వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. ప్లాసెంటా, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ లేక సిజేరియన్‌ ప్రసవం అవసరమా? అనేది వైద్యులు అంచనా వేస్తారు.

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులోకి

గర్భిణీలకు 18 నుంచి 22 వారాల దశలో టిఫా స్కానింగ్‌ కు రిఫర్ చేస్తారు వైద్యులు. ఇకపై ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ ఉచితంగా చేస్తారు. గర్భిణులకు స్కానింగ్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుల సూచనలు చేస్తారు. ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్‌ టెస్ట్ లు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలు లేనివారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌లు నిర్వహిస్తారు. గత ఏడాది ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవ సేవలు పొందారని అధికారులు వెల్లడించారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కానింగ్ చేయడానికి అవసరమైన విధానాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని ఆరోగ్య శ్రీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మెడికోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు ఈ సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించారు.