AP Ration Cards : రేషన్ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు.. పూర్తి వివరాలు ఇవే
24 November 2024, 14:11 IST
- AP Ration Cards : రేషన్ కార్డులేని వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు వరకు దరఖాస్తు స్వీకరణ చేపట్టాలని నిర్ణయించింది. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించనున్నారు.
రేషన్ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్
రాష్ట్రంలో ఇప్పటికే 3.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ల్పిట్ (విభజన) కోసం 46,918 దరఖాస్తులు, కుటుంబ సభ్యుల యాడింగ్ (కార్డులో చేర్చడం) కోసం 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588 దరఖాస్తులు, అడ్రస్ మార్పు కోసం 8,263 దరఖాస్తులు, సరెండర్ కోసం 685 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
డిజెన్ల మార్పు..
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతోంది. ఇది పూర్తి అయ్యాకనే కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం కార్డులో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి బొమ్మలతో ఉన్నాయి. అలాగే ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో రేషన్ కార్డులు ఉన్నాయి. జగన్, వైఎస్సార్ బొమ్మలు తొలగించడంతో సహా రంగులు కూడా మార్చి, కొత్త డిజైన్‌లతో రేషన్ కార్డులను తీసుకురానున్నారు.
గ్రామసభలు..
రాష్ట్రంలో అనర్హుల కార్డులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు ఏర్పటు చేయనుంది.
తెల్ల రేషన్ కార్డులు..
పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, మరో 1,36,420 పీహెచ్‌హెచ్ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు. ఈ కార్డులను తొలగిస్తే రూ.90 కోట్ట వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 1.60 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుందని నిర్ణయించారు. ఇప్పటికే 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
ఈ కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార ఇతర సరుకులు అందిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు అన్ని రేషన్ కార్డుదారులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఎందుకంటే చాలా రేషన్ కార్డుదారులు జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు తీసుకురాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)