Jai Hanuman: ఉత్కంఠ వీడింది.. ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా జాతీయ అవార్డు విన్నర్
Jai Hanuman First Look - Rishab Shetty: జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. దీంతో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారో వెల్లడైంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నేడు రిలీజ్ చేశారు.
‘జై హనుమాన్’ సినిమాలో హనుంతుడిగా ఎవరు నటించనున్నారో ఉత్కంఠ వీడింది. ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా భారీ బ్లాక్‍బస్టర్ మూవీ హనుమాన్‍కు సీక్వెల్‍గా జై హనుమాన్ చిత్రం వస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా ఈ చిత్రం రానుంది. ఈ సీక్వెల్ మూవీపై హైప్ విపరీతంగా ఉంది. ఈ తరుణంలో జై హనుమాన్ చిత్రం నుంచి నేడు (అక్టోబర్ 30) ఫస్ట్ లుక్ వచ్చేసింది. హనుమంతుడి పాత్ర ఎవరు పోషించనున్నారో వెల్లడైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయింది.
హనుంతుడిగా రిషబ్ శెట్టి
జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడిగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించనున్నారు. ‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియాలో రిషబ్ పాపులర్ అయ్యారు. ఆ చిత్రంలో అతడి నటన ప్రశంసలను దక్కించుకుంది. కాంతారకు గాను ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా రిషబ్ అందుకున్నారు. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్‍ను ప్రశాంత్ వర్మ నేడు రివీల్ చేశారు. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‍లోకి రిషబ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఫస్ట్ లుక్ ఇలా..
హనుమంతుడిగా ఉన్న రిషబ్ శెట్టి.. మోకాళ్లపై కూర్చొని చేతులతో శ్రీరాముడి విగ్రహాన్ని పట్టుకొని భక్తితో గుండెలకు హత్తుకున్నారు. జై హనుమాన్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుంతుడి పాత్ర రిషబ్‍కు సరిగ్గా సూటైనట్టు కనిపిస్తోంది. రిషబ్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరగనున్నాయి. దీపావళి పండుగ ముందు ఈ భారీ అప్‍డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
జాతీయ అవార్డు సాధించిన రిషబ్ శెట్టితో పని చేయడం గౌరవంగా భావిస్తున్నానని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. “గ్రాండ్ విజన్ జై హనుమాన్‍ను తీసుకొచ్చేందుకు జాతీయ అవార్డు విన్నింగ్ యాక్టర్ రిషబ్ శెట్టి, ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. జై హనుమాన్ అనే దివ్యమైన నామస్మరణతో దీపావళిని మొదలుపెడదాం. ప్రపంచమంతా ఇది ప్రతిధ్వనించాలి” అని ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశారు.
హనుమాన్ చిత్రం ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజై పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రలో తేజ సజ్జా హీరోగా నటించారు. హనుమంతుడితో ఈ మూవీ క్లైమాక్స్‌ను ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సూపర్ హీరో ఎలిమెంట్స్, ఎంటర్‌మెంట్ కూడా అలరించాయి. ఈ మూవీ క్లైమాక్స్‌తో జై హనుమాన్ చిత్రంపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. సుమారు రూ.40 కోట్లతో రూపొంది ఏకంగా సుమారు రూ.350కోట్ల భారీ కలెక్షన్లను దక్కించుకుంది హనుమాన్.
జై హనుమాన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేయనుంది. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకం నిర్మించగా.. సీక్వెల్ మైత్రి చేతికి వెళ్లింది. జై హనుమాన్‍లోనూ తన పాత్ర ఉంటుందని తేజ సజ్జా కూడా గతంలో హింట్ ఇచ్చారు.
టాపిక్