Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?-hanuman director prasanth varma movie with ranveer singh got shelved says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Hari Prasad S HT Telugu
May 21, 2024 10:53 AM IST

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తో చేయాల్సి ఉన్న భారీ బడ్జెట్ సినిమా అటకెక్కిందా? ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prasanth Varma Ranveer Singh: హను-మాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. ఈ రికార్డు బ్రేకింగ్ సినిమా తర్వాత అతడు ఎలాంటి మూవీ తీయబోతున్నాడో అన్న ఆసక్తి నెలకొంది. హనుమాన్ కు సీక్వెల్ అయిన జై హనుమాన్ కంటే ముందే అతడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చినా.. ఇప్పుడా మూవీ అటకెక్కినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్, రణ్‌వీర్ మూవీ ఏమైంది?

ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ హైదరాబాద్ లో కలిసి కనిపించినప్పుడే ఈ ఇద్దరి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక మూవీ అనౌన్స్‌మెంటే మిగిలింది అనుకున్న సమయంలో ఇప్పుడీ సినిమా అటకెక్కినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పట్లో ఈ మూవీ తెరకెక్కే అవకాశం లేదనీ తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మధ్య ఈ సినిమాకు సంబంధించి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు సమాచారం.

దీంతో ఈ ఇద్దరూ తమ సినిమాను పక్కన పెట్టేయాలని నిర్ణయించినట్లు బజ్ క్రియేటైంది. ఇందులో నిజమెంత అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ మూవీ కోసం ఓ టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు అసలు సినిమానే తెరకెక్కేది సందేహంగా మారింది. అయితే దీనిపై ఇటు ప్రశాంత్ వర్మగానీ, అటు రణ్‌వీర్ సింగ్ గానీ స్పందించలేదు.

టైటిల్ కూడా పెట్టేసినా..

ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ సినిమాకు రాక్షస్ అనే టైటిల్ కూడా పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా ఓ ఎంటర్‌టైన్మెంట్ వెబ్ సైట్ లో వచ్చిన వార్త ప్రకారం.. ఈ సినిమా ఇక తెరకెక్కే అవకాశం లేదు. ప్రశాంత్, రణ్‌వీర్ తమ మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ను పరిష్కరించడానికి వివిధ రకాలుగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయిందని ఆ రిపోర్టు వెల్లడించింది.

ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ తన తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. భార్య దీపికా పదుకోన్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తొలిసారి ఆమె సోమవారం (మే 19) ముంబైలో ఓటు వేయడానికి వెళ్తూ తన బేబీ బంప్ చూపించింది. రణ్‌వీర్ చాలా జాగ్రత్తగా ఆమెను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లడంతోపాటు తిరిగి తిరిగి తీసుకొచ్చాడు.

రణ్‌వీర్ ఓవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం స్క్రిప్ట్ లు వింటూనే ఉన్నా.. చాలా వరకు కుటుంబంతోనే గడుపుతున్నాడు. మరోవైపు అతడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3లో నటిస్తున్న విషయం తెలిసిందే. డాన్ తొలి రెండు భాగాల్లో షారుక్ నటించగా.. మూడో భాగంలో రణ్‌వీర్ రావడం విశేషం. ఈ మూవీలో కియారా అద్వానీ కూడా నటిస్తోంది. ఇదే కాకుండా శక్తిమాన్ మూవీలోనూ రణ్‌వీర్ నటిస్తున్నాడు.

ఇటు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ మూవీకి సీక్వెల్ అయిన జై హనుమాన్ మూవీ తీయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మొత్తంగా తాను హిందూ దేవుళ్లే సూపర్ హీరోలుగా 12 సినిమాలు తీయనున్నట్లు గతంలోనే ప్రశాంత్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Whats_app_banner