తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Employees Withdraw Strike Proposal As Government Agreed To Their Main Demands

AP PRC | దిగి వచ్చిన ప్రభుత్వం.. ఉద్యోగుల సమ్మె ప్రతిపాదన విరమణ

HT Telugu Desk HT Telugu

06 February 2022, 7:00 IST

    • ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ఫలించాయి. శనివారం అర్ధరాత్రి వరకూ మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో రెండు వర్గాలూ కాస్త తగ్గాయి. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, క్వాంటం పెన్షన్‌ వంటి అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నాయి.
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం (twitter)

ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు పైచేయి సాధించాయి. శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి పది గంటల వరకూ సుదీర్ఘంగా సాగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. చాలా వరకూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. 

శుక్రవారం జరిగిన చర్చలు విఫలం కాగా.. శనివారం మరోసారి మంత్రులు, సీనియర్‌ అధికారులు.. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఫలితం తమకు సానుకూలంగా రావడంతో ఈ నెల 7 నుంచి ఇచ్చిన సమ్మె పిలుపును ఉద్యోగ సంఘాలు విరమించుకున్నాయి. సుమారు ఏడు గంటల పాటు చర్చించిన తర్వాత శనివారం రాత్రి ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. 

పట్టువిడుపులు

హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను మార్చడానికి అంగీకరించడంతోపాటు ఐఆర్‌ బకాయిల రికవరీ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. అటు ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులు కాస్త వెనక్కి తగ్గారు. ఇది కనీసం 30 శాతంగా ఉండాలని వాళ్లు అడిగినా.. అది ముగిసిపోయిన అధ్యాయమని, 23 శాతంగానే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఉద్యోగులు చేసిన రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సోమవారం నుంచి వాళ్లు యథావిధిగా విధులకు హాజరుకానున్నారు. ఈ నెల 3న ఉద్యోగులు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ విజయవంతం కావడంతో ఉద్యోగుల నిరసనను ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారు. సీనియర్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌లతోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మలతో సమావేశమై సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. 

అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో రెండు విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఉద్యోగులతో వర్చువల్‌గా మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని వాళ్లను కోరారు.

చర్చల్లో తేలింది ఇదీ..

తాజా చర్చల ప్రకారం హెచ్‌ఆర్‌ఏను సవరించనున్నారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారికి హెచ్‌ఆర్‌ఏ 16 శాతంగా, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 24 శాతంగా నిర్ణయించారు. 2022, జనవరి 1 నుంచి ఈ సవరించిన హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తారు. 

ఇక అదనపు క్వాంటం పెన్షన్‌ విషయానికి వస్తే 70 నుంచి 74 ఏళ్ల మధ్య రిటైర్డ్‌ ఉద్యోగులకు 7 శాతం, 75 నుంచి 79 ఏళ్ల మధ్య వారికి 12 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వనున్నారు. 

ఫిట్‌మెంట్‌ మాత్రం గతంలో ప్రభుత్వం చెప్పినట్లు 23 శాతంగానే కొనసాగుతుంది. ఇక 2019 జులై నుంచి 2020 మార్చి వరకూ చెల్లించిన 27 శాతం ఐఆర్‌ను ఉద్యోగుల నుంచి రికవరీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీసీఏ గతంలోలాగే కొనసాగుతుంది. ఐదేళ్లకోసారి పీఆర్సీని కొనసాగించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.