తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc On Police Recruitment : అభ్యంతరాలపై కౌంటర్ వేయాలని బోర్డుకు హైకోర్టు ఆదేశం

AP HC On Police Recruitment : అభ్యంతరాలపై కౌంటర్ వేయాలని బోర్డుకు హైకోర్టు ఆదేశం

HT Telugu Desk HT Telugu

10 March 2023, 6:17 IST

    • AP HC On Police Recruitment ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ప్రాథమిక పరీక్షలో 8ప్రశ్నలకు జవాబులను సరిగా గుర్తించలేదని ఆరోపిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 80 మంది అభ్యర్థులు  కోర్టును ఆశ్రయించారు. 
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

AP HC On Police Recruitment ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఎనిమిది ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి గడువు కోరింది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ కోసం హాజరైన 80 మంది అభ్యర్థులు జవాబులను సరిగా గుర్తించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు నియామక బోర్డును, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

మరోవైపు పోలీస్ నియామక ప్రక్రియ శరీర సామర్థ్య పరీక్షలు జరుగుతున్న దశలో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వేసే కౌంటర్‌ పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.

పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదని, బోర్డు చేసిన పొరపాటు వల్ల తాము దేహదారుఢ్య పరీక్షలకు అనర్హులమయ్యామని చెబుతూ 80 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. అకాడమీ పుస్తకాల్లో ఉన్న జవాబులకు భిన్నంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తుది 'కీ' విడుదల చేశారని.. 8 ప్రశ్నల జవాబులను నిపుణుల కమిటీ తేల్చేలా ఆదేశించాలని, ఈలోపు తమను కూడా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పిటిషనర్లు కోరారు.

జవాబు కీలో తప్పుల కారణంగా అభ్యర్థులకు అన్యాయం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల న్యాయవాది గుర్తుచేశారు. కీలో నిర్దిష్టమైన తప్పులున్నప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్ల జవాబులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు తరఫు న్యాయవాదులకు సూచించారు.

కోర్టు నిర్ణయంపై పోలీస్ బోర్డు తరపు న్యాయవాది కిశోర్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. ఈ తరహా ఆదేశాలు నియామక ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం అవుతుందన్నారు. అరుదైన సందర్భాల్లో తప్ప నియామక ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, పిటిషనర్లను అనుమతిస్తే.. మరికొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే కీ విడుదల చేశారని, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వం తరపున కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని అభ్యర్థించారు. ప్రభుత్వ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని కౌంటర్ వేయాలని ఆదేశించారు. విచారణ 20వ తేదీకి వాయిదా వేశారు.