తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc On Advisors : సలహాదారుల జవాబుదారీతనమెంత…రాజ్యాంగ బద్దతేమిటన్న హైకోర్టు

AP HC On Advisors : సలహాదారుల జవాబుదారీతనమెంత…రాజ్యాంగ బద్దతేమిటన్న హైకోర్టు

HT Telugu Desk HT Telugu

03 February 2023, 9:19 IST

    • AP HC On Advisors ఆంధ‌్రప్రదేశ్‌‌లో  ప్రతి ప్రభుత్వ శాఖలో  ఎడపెడ సలహాదారుల్ని నియమిస్తుడంటంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకాలకు ఉన్న చట్టబద్దతను ప్రశ్నించడంతో పాటు వారిలో జవాబుదారీతనం ఎంత వరకు ఉంటుందని నిలదీసింది.  సలహాదారుల నియామకంపై చీఫ్‌ జస్టిస్ ప్రశాంత్ కుమార్  నేతృత్వంలోని ధర్మాసనం   రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

AP HC On Advisors ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులు సలహాదారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారని అడ్వకేట్‌ జనరల్‌ చేసిన వాదనపై తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రభుత్వంలో భాగమే అయినా వారు మాత్రమే ప్రభుత్వం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

ప్రభుత్వాలను నడిపించే ఉన్నత స్థాయి వ్యక్తులు చట్టబద్ధమైన పాలనను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరిపాలనా వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. సాధారణ వ్యక్తులను రాత్రికి రాత్రి సలహాదారులుగా నియమించుకోవడానికి వీల్లేదంది. సాధారణ పౌరులుగా ఉంటూ, బయట నుంచి ప్రభుత్వంలోకి సలహాదారులుగా వచ్చిన వ్యక్తులకు జవాబు దారీతనం ఏముంటుందని ప్రశ్నించింది.

ఏపీలో సలహాదారుల నియామకానికి అమలు చేస్తున్న నిబంధనలు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు వారికి విధుల నిర్వహణలో ప్రవర్తన నియమావళి ఎక్కడ ఉందని ప్రశ్నించింది. సలహాదారులు మంత్రుల సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారని, ప్రభుత్వ టెండర్లు, కీలక నిర్ణయాలపై అంతర్గత సమాచారం వారి ద్వారా బయటకు వచ్చే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సలహాదారుల నియామకాలపై రాజ్యాంగబద్ధతను తేలుస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది. సలహాదారులను నియమించుకుంటూ పోతే ఆ సంఖ్యకు అంతు ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో వాదనలు ఈ నెల 20న కొనసాగనున్నాయి.

ఆంధ్రప దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియామకాన్ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కే రాజశేఖరరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్‌.చంద్రశేఖరరెడ్డిని నియమించడాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్‌.మునెయ్య హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఇవి గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.

రాజ్యాంగేతర నియామకాలు….

బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. 'నచ్చినవారిని సలహాదారులుగా నియమించి, వారి జీతభత్యాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. సలహాదారుల నియామక వివరాలను కోర్టు ముందుంచిన ప్రభుత్వం, నియామక నిబంధనలు, అర్హతలేమిటో అందులో పేర్కొనలేదని చెప్పారు. సలహాదారులను నియమించే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అవి రాజ్యాంగేతర నియామకాలని చెప్పారు.

చట్టబద్ధత లేని నియామకాలను రద్దు చేయాలని కోర్టును కోరారు. మరో పిటిషనర్‌ మునెయ్య తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. 'రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి పైగా సలహాదారులను నియమించి, వారందరికీ క్యాబినెట్‌ హోదా కల్పించిందని భారీగా జీతభత్యాలు చెల్లిస్తోందని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమిస్తూ పునరావాస కేంద్రంగా మార్చిందన్నారు.

రాజకీయ కారణాలతోనే పిటిషన్లు….

చంద్రశేఖరరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వ హయాంలోనూ సలహాదారులను నియమించారని, అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. సలహాదారుల నియామకాలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నవేనన్నారు. రాజకీయ కారణాలతో వేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్శ్రీ రామ్‌ వాదనలు వినిపించారు. సలహాదారుల నియామకాన్ని నిలువరిస్తూ చట్టమేమీ లేదని, గత ప్రభుత్వాలూ సలహాదారులు, నిపుణులు, కన్సల్టెంట్లను నియమించాయని వారి వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందని చెప్పారు.

సలహాదారులు ప్రభుత్వ అధికారులు కాదని అధికార విధుల్లో జోక్యం చేసుకోరని అవసరానికి తగినట్లు నిర్దిష్ట కాలానికే సలహాదారులను నియమిస్తున్నామని చెప్పారు. సలహాదారుల సంఖ్య భారీగా లేదని వారివి రాజ్యాంగేతర నియామకాలు కాదన్నారు. సలహాదారులపై గతంలో ఏవైనా క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఆ వివరాలతో పాటు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కోర్టు ముందుంచుతామని, సమయం ఇవ్వాలని కోరారు. సలహాదారుల నియామకంపై న్యాయస్థానం ఏదైనా విధానం, మార్గదర్శకాలు సూచిస్తే అనుసరిస్తామని చెప్పారు.

ఏజీ వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వబోమని, సలహాదారుల నియామకంలో రాజ్యాంగబద్ధతను మాత్రమే తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారులను అన్ని ప్రభుత్వాలూ నియమిస్తున్నాయని, తాము నిర్దిష్టంగా ఏ ప్రభుత్వాన్నీ తప్పుపట్టడం లేదని ఈ వ్యవహారంలో ఉన్న చట్టబద్దతను మాత్రమే విచారిస్తామని పేర్కొంది.

టాపిక్