తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Roja On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, ఎన్టీఆర్ కు క్షమాపణ చెబుతూ తీర్మానం చేయాలి - మంత్రి రోజా

Minister Roja On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, ఎన్టీఆర్ కు క్షమాపణ చెబుతూ తీర్మానం చేయాలి - మంత్రి రోజా

27 May 2023, 17:45 IST

    • Minister Roja On Mahanadu : టీడీపీ మహానాడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. మహానాడు కాదు మాయనాడని రోజా విమర్శించారు. మహానాడులో ఎన్టీఆర్ కు క్షమాపణలు చెబుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఆర్కే రోజా
మంత్రి ఆర్కే రోజా (Twitter )

మంత్రి ఆర్కే రోజా

Minister Roja On Mahanadu : రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. అయితే మహానాడుపై మంత్రులు విమర్శలు స్టార్ట్ చేశారు. మంత్రి ఆర్కే రోజా, జోగి రమేష్ మహానాడుపై మండిపడ్డారు. టీడీపీ చేస్తోంది మహానాడు కాదు మాయనాడని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. రెండు సార్లు ఓడిన లోకేశ్ ఫొటో వేసి రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మహానాడులో ఎన్టీఆర్ పై సస్పెన్షన్ ని ఎత్తివేయాలని, దాంతో పాటు ఆయనపై చెప్పులేసినందుకు క్షమాపణ కోరుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ ను తిట్టడానికే మహానాడు పెట్టినట్టుందన్నారు.

అచ్చెన్నాయుడికి సవాల్

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎక్కడైనా సరే... అచ్చెన్నాయుడు వస్తే పేదల ఇళ్లు ఎలా కడుతున్నారో చూపిస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు. మహానాడులో చంద్రబాబు అసహనం బయటపడిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఫొటో ఒక్కటైన మహానాడులో ఉందా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ ఇస్తుంటే సహించలేక హేళన చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. పేదలకు భూమి ఇస్తుంటే సమాధులు కట్టుకోవడానికా అని మాట్లాడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. సెంటు భూమి అంటే ఆడబిడ్డల సెంటిమెంటు అని జగన్ నిరూపిస్తున్నారన్నారు.

ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది- జోగి రమేష్

మహానాడులో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి జోగి రమేష్‌ కౌంటర్ అచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నిండు నూరేళ్లు జీవించి ఉండేవాడినని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారన్నారు. ఒక క్షణం ప్రాణం వస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మహానాడు వేదికపై సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడుని కోరుకుంటారన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేసి, మానసికంగా హింసించి చంపేశారని, ఇప్పుడు శతజయంతి పేరుతో దండాలు పెడుతున్నారని విమర్శించారు. బీసీలకు మేలు చేశానని చంద్రబాబు చెబుతున్నారని, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారన్నారు.

ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు

టీడీపీ నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక సెంటు భూమి సరిపోదట అంటూ ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు సైజ్ కు పడుకోవటానికి ఒక ఊరు కూడా సరిపోదని విమర్శించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక సెంటు స్థలం కూడా పేదలకు పంచిపెట్టలేదన్నారు. ఇప్పుడేమో పెద్ద మాటలు మాట్లాతున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలోడికి దసరా పండగ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు.