CM Chandrababu : ఏపీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయ్, రాష్ట్ర అవసరాలను కేంద్రం గుర్తించింది - సీఎం చంద్రబాబు
23 July 2024, 19:50 IST
- CM Chandrababu : ఏపీ అవసరాలను కేంద్రం గుర్తించిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయ్, రాష్ట్ర అవసరాలను కేంద్రం గుర్తించింది - సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామన్నారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి పెనుమార్పులకు నాంది పలికిందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైందన్నారు. వికసిత్ భారత్ 2047కు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందన్నారు. ఆనాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చామని, ఇవాళ తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లిన కనిపించే పరిస్థితి ఉందన్నారు. జూన్ 4న వెలువడిన ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయననారు. నా రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదన్నారు. ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉందన్నారు. గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. జైలుకు వచ్చి పవన్ కల్యాణ్ తనను పరామర్శించారని, క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ముందుకొచ్చారన్నారు.
ఐదేళ్లు చీకటి రోజులు
"రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చింది. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసేవరకు సమిష్టిగా ముందుకెళ్తాం. ఈ ఎన్నికల ఫలితాలు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు, ఓటు వేయడానికి లక్షలు ఖర్చు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఒకే ఒక లక్ష్యంతో వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఎంతసేపైనా ఓపిగ్గా ఉండి ఓటు వేసి గెలిపించిన అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులు. ఎక్కడా భూముల్ని, ఆస్తులను వదల్లేదు. మెడపై కత్తి పెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్న ఘటనలు చూశాం. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఒకటి కాదు అన్నీ చూశాం" - సీఎం చంద్రబాబు
ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది
ఏపీ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను గుర్తించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిలో పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని, అహంకారంతో విర్రవీగి అసమర్థతతో వ్యవస్థలు నాశనం చేశారన్నారు. జగన్ పాలనలో మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్ లో పెట్టారని, మళ్లీ మంచి రోజులు ప్రారంభమయ్యాయని ఆశ వచ్చిందన్నారు. ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తైతే, కావాలని కాంట్రాక్టర్లు, అధికారులను మార్చారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
హూ కిల్డ్ బాబాయ్
హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని, వివేకా హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు, సీబీఐకి విషయం తెలపడానికి సీఐ సిద్ధపడ్డారన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదాయం గత ఐదేళ్లలో దోపిడీ జరిగిందన్నారు. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్ల మేర దోపిడీ చేశారని ఆరోపించారు. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందన్నారు. మూలధనాన్న 60 శాతం మేర తగ్గించారన్నారు. జలవనరులపై 56 శాతం, రోడ్లపై 85 శాతం మూలధనం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగు చేస్తామన్నారు. రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.
త్వరలో రుషికొండ పర్యటన
"భూముల కుంభకోణమే రూ.40 వేల కోట్లకు పైగా జరిగింది. మిగతా డబ్బులు మళ్లించి రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. రూ.41 వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ఛార్జ్ షీట్ వేసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలందరూ రుషికొండ వెళ్దాం. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సలహాలు ఇవ్వాలి. అమరావతిని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం. తప్పు చేసిన వ్యక్తులను చట్టపరంగా శిక్షిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతీకారం తీసుకుంటే సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో హింసకు తావు లేదు. ఇకపై రాజకీయ ముసుగులో నేరాలు చేయకూడదు. తీవ్రవాదం సమస్య సులువుగా పరిష్కరించాం. ముఠాలను తుదముట్టించాల్సిన అవసరం ఉంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో 22ఏ, అసెన్డ్ భూరికార్డులు తగులబెట్టారు. వెంటనే వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని డీజీపీ, సీబీసీఐడీకి ఆదేశాలు ఇచ్చాను. షార్ట్ సర్క్యూట్ కాదు.. ఫైళ్లు తగులబెట్టారని చెబుతున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై తగు చర్యలు తీసుకుంటాం" - సీఎం చంద్రబాబు