Budget 2024 Live Updates : ముగిసిన నిర్మల బడ్జెట్​.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు-union budget 2024 live updates nirmala sitharamans first budget in modi 3 0 income tax news ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 Live Updates : ముగిసిన నిర్మల బడ్జెట్​.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు

కేంద్ర బడ్జెట్​ 2024 లైవ్​ అప్డేట్స్​..

Budget 2024 Live Updates : ముగిసిన నిర్మల బడ్జెట్​.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు

12:42 PM ISTJul 23, 2024 06:12 PM HT Telugu Desk
  • Share on Facebook
12:42 PM IST

  • Union Budget 2024 Live Updates : దేశంలో మరో కీలక ఘట్టం. మోదీ 3.0లో తొలి బడ్జెట్​ని నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Tue, 23 Jul 202412:42 PM IST

18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఎన్పీఎస్ - వాత్సల్య

భవిష్యత్తులో 18 సంవత్సరాల లోపు పిల్లల పెన్షన్ అవసరాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నేషనల్ పెన్షన్ స్కీమ్ - వాత్సల్య’ ను ప్రవేశపెట్టింది. ఈ ఎన్పీఎస్ వాత్సల్య, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లల కోసం పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది.

Tue, 23 Jul 202410:39 AM IST

‘ఇది కుర్చీ బచావో బడ్జెట్’ - రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ మిత్ర పక్షాల కోసం రూపొందించిన బడ్జెట్ లా ఉందని విమర్శించారు. తమ కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రభుత్వానికి మద్దతిస్తున్న ప్రధాన పార్టీలను ప్రసన్నం చేసుకోవడమే ఈ బడ్జెట్ లక్ష్యంగా కనిపిస్తోందని ఎక్స్ లో ఒక పోస్ట్ లో రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మిత్రపక్షాల కోసం వేరే రాష్ట్రాలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు ప్రయోజనం చేకూర్చడం, సామాన్యుడికి అన్యాయం చేయడం.. లక్ష్యంగా ఈ బడ్జెట్ ను రూపొందించారన్నారు.

Tue, 23 Jul 202408:50 AM IST

బడ్జెట్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను బలోపేతం చేస్తుందన్నారు. ‘ఇది దేశంలోని పేదలు, గ్రామాలు, రైతులను శ్రేయస్సు మార్గంలో తీసుకెళ్తుంది’ అని ప్రధాని వీడియో సందేశంలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని తెలిపారు. ‘కొత్త మధ్యతరగతి సాధికారత కోసమే ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ తో యువతకు అపరిమిత అవకాశాలు లభిస్తాయి. ఈ బడ్జెట్ నుంచి విద్య, నైపుణ్యానికి కొత్త ఊపు వస్తుంది. కొత్త మధ్యతరగతికి ఈ బడ్జెట్ అధికారం ఇస్తుంది. మహిళలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

Tue, 23 Jul 202407:50 AM IST

మా బడ్జెట్ ప్రయారిటీలు ఇవే: నిర్మల సీతారామన్

ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు సహా తొమ్మిది ప్రాధాన్యాలు బడ్జెట్లో ఉన్నాయని నిర్మల సీతారామన్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఉపాధి అవకాశాలను వేగవంతం చేయడమే ప్రభుత్వ విధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి తెలిపారు.

Tue, 23 Jul 202407:34 AM IST

విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలు

విద్యార్థులకు దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలను అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ పథకాలు, విధానాల కింద ఎటువంటి ప్రయోజనం పొందడానికి అర్హత లేని మన యువతకు సహాయం చేయడానికి ప్రభుత్వం దేశీయ సంస్థలలో ఉన్నత విద్య కోసం రూ .10 లక్షల వరకు రుణాలకు ఆర్థిక మద్దతును ప్రభుత్వం అందిస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాల కోసం ఈ-వోచర్లను ఏటా లక్ష మంది విద్యార్థులకు అందించనున్నారు. ఈ వోచర్లు రుణ మొత్తంపై 3% వార్షిక వడ్డీ రాయితీని కవర్ చేస్తాయి.

Tue, 23 Jul 202407:29 AM IST

తొలి సారి ఉద్యోగంలో చేరిన వారికి ఆర్థిక సాయం

ఫార్మల్ సెక్టార్ లో తొలి సారి ఉద్యోగంలో చేరిన వారికి వారి నెల జీతం ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఆధారంగా రూ. 15 వేల వరకు, మూడు విడతల్లో, నేరుగా నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల 2.1 కోట్ల మంది యువత లబ్ధి పొందుతారని తెలిపారు.

Tue, 23 Jul 202407:24 AM IST

స్టార్ట్ అప్స్ కు గుడ్ న్యూస్

ఏంజిల్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. స్టార్ట్ అప్స్ లో, వాటి మార్కెట్ వాల్యూని మించి ఏంజిల్ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై ఈ పన్ను విధిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ లో మనీ లాండరింగ్ ను నిరోధించడం కోసం దీనిని 2012లో ప్రవేశపెట్టారు. తాజాగా, ఈ టాక్స్ ను రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ తెలిపారు.

Tue, 23 Jul 202407:19 AM IST

యువతకు నెలకు రూ. 5 వేల అలవెన్స్

ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్న్షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్ షిప్ అందిస్తారు. వారికి సంవత్సరం పాటు నెలకు రూ. 5 వేలు ఇంటర్న్ షిప్ అలవెన్స్ ఇస్తారు. వన్ టైమ్ అసిస్టెన్స్ గా మరో రూ. 6 వేలు ఇస్తారు. శిక్షణ ఖర్చులు, ఇంటర్న్షిప్ ఖర్చుల్లో 10 శాతాన్ని సీఎస్ఆర్ నిధుల నుంచి కంపెనీలు భరిస్తాయి.

Tue, 23 Jul 202407:13 AM IST

ఈ వస్తువుల రేట్లు తగ్గుతాయి..

కస్టమ్స్ సుంకం తగ్గింపు వల్ల పలు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వల్ల కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, మొబైల్ ఫోన్స్, చార్జర్స్, బంగారం, వెండి, ప్లాటినం, లెదర్ గూడ్స్, సీ ఫుడ్ ప్రొడక్ట్స్.. ధరలు తగ్గనున్నాయి.

Tue, 23 Jul 202407:11 AM IST

తగ్గనున్న బంగారం, వెండి ధరలు

కేంద్ర బడ్జెట్ లో దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. దీంతో బంగారం, వెండి, ప్లాటినం ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండి పై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని 6.5 శాతానికి తగ్గించారు.

Tue, 23 Jul 202407:05 AM IST

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

కొత్త ట్యాక్స్​ వ్యవస్థలో మార్పులు జరిగాయి. కానీ పాత విధానాన్ని మార్చలేదు. మరోవైపు బడ్జెట్​ ముగిసిన అనంతరం స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tue, 23 Jul 202407:06 AM IST

కొత్త ట్యాక్స్​ వ్యవస్థలో

కొత్త ట్యాక్స్​ వ్యవస్థలో ట్యాక్స్​ రేట్​ స్ట్రక్చర్​ని సవరిస్తున్నట్టు నిర్మలా సీతారామన్​ తెలిపారు. అవి..

3-7 లక్షలు 5శాతం

7-10 లక్షలు 10శాతం

10-12లక్షలు- 15శాతం

12-15 లక్షలు- 20శాతం.

15లక్షలు అంతకన్నా ఎక్కువ 30శాతం

Tue, 23 Jul 202406:59 AM IST

స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. స్టాండర్డ డిడక్షన్ ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

Tue, 23 Jul 202406:53 AM IST

తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు

మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీబీఏ, మొబైల్ ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు 100 రెట్లు పెరిగాయని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Tue, 23 Jul 202406:52 AM IST

లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​

లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​పై 12.5శాతం పన్ను : నిర్మల

లిస్టెట్​ ఫైనాన్షియల్​ అసెస్ట్స్​ని ఏడాది కన్నా ఎక్కువ హోల్డ్​ చేస్తేనే అది లాంగ్​ టర్మ్​ అవుతుంది " నిర్మల

Tue, 23 Jul 202406:38 AM IST

ద్రవ్య లోటు..

జీడీపీలో ద్రవ్య లోటు అంచనా 4.9శాతం : నిర్మలా సీతారామన్​

Tue, 23 Jul 202406:37 AM IST

బిహార్​పై ఫోకస్​..

రూ.21,400 కోట్ల వ్యయంతో పీర్ పాయింటి వద్ద 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టబడతాము. బిహార్​లో కొత్త విమానాశ్రయాలు , వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.

బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల నుంచి బాహ్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ అభ్యర్థనలను వేగవంతం చేస్తారు.

గయాలో ఇండస్ట్రియల్ నోడ్: బీహార్ లోని గయ నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాట్నా - పూర్ణియా ఎక్స్‌ప్రెస్ వే, బక్సర్ - భాగల్పూర్ హైవే, బోధ్గయా - రాజ్గిర్ - వైశాలి - దర్భాంగా, బక్సర్లో గంగా నదిపై రూ. 26,000 కోట్లతో అదనపు రెండు వరుసల వంతెన అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు.

ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

టూరిజంలో భాగంగా టెంపుల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Tue, 23 Jul 202406:36 AM IST

జీఎస్టీ..

జీఎస్టీ ట్యాక్స్​ స్ట్రక్చర్​ని మరింత సరళతరం చేసేందుకు కృషి చేయనున్నట్టు నిర్మల తెలిపారు. వాస్తవానికి జీఎస్టీ వ్యవస్థ భారీ సక్సెస్​ సాధించి, ప్రజలకు లబ్ధిచేకూర్చిందని అన్నారు.

Tue, 23 Jul 202406:33 AM IST

టూరిజం..

నలందని టూరిస్ట్​ హబ్​గా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.

విష్ణుపాద, మహాబోది ఆలయాలను అభివృద్ధి చేస్తుంది.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం ఒడిశాకు ఆర్థిక సాయం.

Tue, 23 Jul 202406:21 AM IST

బిహార్​కు 'ఇన్​ఫ్రా' వరం..

బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్​లో మాత్రం మౌలికవసతుల వర్షాన్ని కురిపించింది. రోడ్లు, వంతెనలు, ప్రకృత్తి విపత్తు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్​ తెలిపారు.

Tue, 23 Jul 202406:20 AM IST

పేదలకు ఇళ్లు..

పట్టణాల్లో నివాసముండే పేదలకు ఇళ్ల కోసం రూ. 10లక్షల కోట్లను వెచ్చించనున్నట్టు నిర్మల తెలిపారు.

Tue, 23 Jul 202406:14 AM IST

స్వల్ప నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

నిర్మల బడ్జెట్​ ప్రసంగం వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tue, 23 Jul 202406:12 AM IST

నిరుద్యోగంపై మోదీ 3.0 ఫోకస్​!

ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగేందుకు దేశవ్యాప్తంగా మహిళలకు ప్రత్యేక హాస్టల్స్​ని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మల స్పష్టం చేశారు.

దేశంలోని టాప్​ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఇంటర్న్​షిప అవకాశాలను కల్పిస్తున్నట్టు నిర్మల తెలిపారు.

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్యోగాలపై అధిక ఫోకస్​ పెట్టినట్టు కనిపిస్తోంది. నాటి ఎన్నికల్లో మోదీ-బీజేపీ మెజారిటీ దక్కించుకోలేకపోవడానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక కారణం అన్న విషయం తెలిసిందే.

Tue, 23 Jul 202406:05 AM IST

ఏపీకి నిర్మల వరాలు..

కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు దక్కాల్సిన సాయంపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది రూ. 15 వేల కోట్ల సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే పోలవరం నిర్మాణానికి బకాయిలు ఇస్తామని చెప్పారు. పారిశ్రామిక ప్రగతికి వీలుగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

వీటితో పాటు వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన అభివృద్ధి నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మౌలిక వసతులు ముఖ్యంగా నీటిపారుదల, విద్యుత్తు సరఫరా, రహదారుల నిర్మాణానికి సాయపడతామని చెప్పారు.

Tue, 23 Jul 202406:02 AM IST

ముద్ర రుణాల లిమిట్​ పెంపు..

గతంలో ముద్ర రుణాలు తీసుకుని, సమయానికి తీర్చిన వ్యాపారులకు.. ఈసారి లోన్​ లిమిట్​ని పెంచుతున్నట్టు నిర్మల తెలిపారు.

Tue, 23 Jul 202406:01 AM IST

బిహార్​కి నిధులు..

బిహార్​లోని వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 26వేల కోట్లు ఇస్తున్నాము : నిర్మల

Tue, 23 Jul 202405:58 AM IST

బడ్జెట్​లో ఏపీపై స్పెషల్​ ఫోకస్​..

బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం ఇస్తామని నిర్మల ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​కి కూడా సాయం చేస్తామన్నారు.

Tue, 23 Jul 202405:55 AM IST

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన నిర్మలా సీతారామన్​.

Tue, 23 Jul 202405:51 AM IST

ప్రకృతి వ్యవసాయం..

రెండేళ్ల వ్యవధిలో 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లిస్తామని నిర్మల స్పష్టం చేశారు.

Tue, 23 Jul 202405:47 AM IST

వ్యవసాయం కోసం రూ. 1.52లక్ల కోట్లు..

ఈ దఫా బడ్జెట్​లో వ్యవసాయం, అనుసంధాన రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల బడ్జెట్​ని కేటాయించినట్టు నిర్మల తెలిపారు.

Tue, 23 Jul 202405:42 AM IST

పంటకు మద్దతు ధర..

దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలను పెంచినట్టు నిర్మల తెలిపారు. కనీసం 50శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలను సవరించినట్టు అన్నారు.

Tue, 23 Jul 202405:37 AM IST

ఆ అంశాలపైనే ఫోకస్​..

ఉద్యోగం, మధ్యతరగతి, ఎంఎస్​ఎంఈ, స్కిల్స్​పై దృష్టి సారించి ఈ బడ్జెట్​ని రూపొందించినట్టు నిర్మలా సీతారామన్​ చెప్పారు.

Tue, 23 Jul 202405:36 AM IST

లోక్​సభ ముందుకు బడ్జెట్​..

పార్లమెంట్​ బడ్జెట్​ సమవేశాలు మొదలయ్యాయి. లోక్​సభలో నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ని ప్రవేశపెట్టారు.

Tue, 23 Jul 202405:29 AM IST

బడ్జెట్​కి కేబినెట్​ ఆమోదం..

నిర్మలా సీతరామన్​ ప్రవేశపెట్టనున్న బడ్జెట్​కి కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్రవేసింది. ఇంకొన్ని నిమిషాల్లో లోక్​సభలో నిర్మల బడ్జెట్​ ప్రసంగం మొదలవుతుంది.

Tue, 23 Jul 202405:15 AM IST

పార్లమెంట్​కు ప్రధాని..

బడ్జెట్​ 2024 నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కీలక బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు పార్లమెంట్​కు చేరుకున్నారు. బడ్జెట్​ని ఆమోదించేందుకు కేంద్ర కేబినెట్​ సమావేశమైంది.

Tue, 23 Jul 202404:29 AM IST

మరికొద్ది సేపట్లో బడ్జెట్​ 2024..

యావత్​ భారత దేశం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'బడ్జెట్​ 2024'కి సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్​సభలో మోదీ 3.0 తొలి బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడ్జెట్​కి సంబంధించిన డాక్యుమెంట్స్​ ఇప్పటికే పార్లమెంట్​కు చేరుకున్నాయి.

అంతకుముందు, మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఫైనాన్స్​ మినిస్ట్రీ కార్యాలయానికి వెళ్లారు నిర్మలా సీతారామన్​. బడ్జెట్​ ట్యాబ్లెట్​ను బయటకు తీసుకొచ్చి మీడియాకు చూపించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్​కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, బడ్జెట్​ 2024 గురించి వివరించారు. అక్కడి నుంచి ఇంకొద్ది సేపట్లో పార్లమెంట్​ భవనానికి చేరుకోనున్నారు.

Tue, 23 Jul 202403:53 AM IST

స్టాక్​ మార్కెట్​లు..

బడ్జెట్​ వేళ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్​ 117 పాయింట్లు పెరిగి 80,610 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 50 17 పాయింట్లు పెరిగి 24,526 వద్ద కొనసాగుతోంది.

Tue, 23 Jul 202403:45 AM IST

బడ్జెట్​ ట్యాబ్లెట్​తో నిర్మల..

ఫైనాన్స్​ మినిస్ట్రీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి, బడ్జెట్​ ట్యాబ్లెట్​ని మీడియాకు చూపించారు నిర్మలా సీతారామన్​. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్​కు బయలుదేరారు.

Tue, 23 Jul 202403:33 AM IST

ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మల..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​.. ఫైనాన్స్​ మినిస్ట్రీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్​సభలో బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు.

Tue, 23 Jul 202403:25 AM IST

బడ్జెట్​ సెషన్​ స్టాక్స్​ టు బై

హెచ్ఏఎల్: రూ.4997 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.5225, స్టాప్ లాస్ రూ.4890

జేడబ్ల్యూఎల్: రూ.642 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.675, స్టాప్ లాస్ రూ.625

జిఎన్ఎఫ్సి: రూ .684 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .720, స్టాప్ లాస్ రూ .670

స్పోర్ట్కింగ్ ఇండియా: రూ.1161.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1222, స్టాప్ లాస్ రూ.1120

ఏడబ్ల్యూహెచ్సీఎల్: రూ.663 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.699, స్టాప్ లాస్ రూ.640

నితిన్ స్పిన్నర్స్: రూ.427 వద్ద కొనండి, టార్గెట్ రూ.444, స్టాప్ లాస్ రూ.410

ఆర్సీఎఫ్: రూ.235 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.248, స్టాప్ లాస్ రూ.227

గ్రావిటా ఇండియా: రూ .1449 వద్ద కొనండి, టార్గెట్ రూ .1520, స్టాప్ లాస్ రూ .1400

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Tue, 23 Jul 202403:00 AM IST

నిఫ్టీ 50 బడ్జెట్​ ప్రెడిక్షన్​..

“నిఫ్టీ డైలీ ఛార్ట్​లో స్మాల్​-బాడీ క్యాండిల్​ ఏర్పడింది. ఇది బేరిష్​ ఎన్​గల్ఫ్​ పాటర్న్​. తదుపరి మూమెంట్​ వచ్చే వరకు వేచి చూడాలని ఇది సూచిస్తోంది. ఆర్​ఎస్​ఐ సైతం బేరిష్​ క్రాసోవర్​లోకి ఎంట్రీ ఇచ్చి, ఓవరా బాట్​ జోన్​ నుంచి ఎగ్జిట్​ అవుతోంది. నిఫ్టీ 50 రెసిస్టెనస్​ 24,550 వద్ద ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

Tue, 23 Jul 202402:33 AM IST

స్టాక్​ మార్కెట్​ మదుపర్లు అప్రమత్తం!

బడ్జెట్​ వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం. అయితే మదుపర్లు ఈ సెషన్​లో మదుపర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది.

Tue, 23 Jul 202402:08 AM IST

బడ్జెట్​ ప్రసంగాల హైలైట్స్​..

జశ్వంత్ సింగ్ 2003 బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 13 నిమిషాలకు ముగిసింది. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్​కమ్​ ట్యాక్స్ రిటర్నుల ఈ-ఫైలింగ్, కొన్ని వస్తువులపై ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులను సింగ్ తన ప్రసంగంలో ప్రతిపాదించారు.

1977 లో హీరుభాయ్ ఎం పటేల్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం - 800 పదాలు. 1977లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 800 పదాలే ఉన్నాయి.

Tue, 23 Jul 202401:50 AM IST

సొంత రికార్డును నిర్మల బ్రేక్​ చేస్తారా?

భారతదేశ చరిత్రలో సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మల పేరిట ఉంది. 2020లో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్​ని ప్రవేశపెట్టి 2:42 గంటలు మాట్లాడారు.

Tue, 23 Jul 202401:40 AM IST

సులభతర వాణిజ్యం..

ఎకనామిక్​ సర్వేని ప్రవేశపెడుతూ దేశంలో సులభతర వాణిజ్యం కోసం అనేక చర్యలు చేపట్టినట్టు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. 63 నేరాలను డీక్రిమినలైజ్​ చేసినట్టు వివరించారు. సులభతర వాణిజ్యంలో ఇది గొప్ప ఘనత అన్నారు. నిబంధనలు మరింత సరళతరం చేసి వ్యాపారలకు అనువైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.

Tue, 23 Jul 202401:20 AM IST

ఎకనామిక్​ సర్వే..

బడ్జెట్​కి ముందు, సోమవారం ఎకనామిక్​ సర్వేని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్​. సర్వే ప్రకారం.. భారత వాస్తవ జీడీపీ 6.5 నుంచి 7 శాతం మధ్య వృద్ధి చెందుతుంది. దేశంలో నిత్యం పెరుగుతున్న శ్రామికశక్తిని దృష్టిలో పెట్టుకుని, వ్యవసాయేతర రంగాల్లో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను జనరేట్​ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 23 Jul 202401:03 AM IST

సెక్షన్​ 80సీలో మార్పులు..?

వేతన జీవులు ఒక ఆర్థిక సంవత్సరంలో తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ .1.5 లక్షలు తగ్గించడానికి సెక్షన్ 80 సి మినహాయింపులను ఉపయోగించవచ్చు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నా, 2014 నుంచి ఈ లిమిట్​లో ఏలాంటి మార్పులు రాలేదు. ఈసారైనా మార్పులు ఉంటాయో లేదో చూడాలి.

Tue, 23 Jul 202412:52 AM IST

భారతదేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947-48 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో మొత్తం దేశం బడ్జెట్ నేడు ఒక జిల్లా బడ్జెట్ కంటే తక్కువ లేదా దాదాపు సమానంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 23 Jul 202412:37 AM IST

ఉదయం 11 గంటలకు బడ్జెట్​..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు.

Tue, 23 Jul 202412:18 AM IST

ఎఫ్​ అండ్​ ఓ ట్రేడర్స్​కి అలర్ట్​..

ఈ దఫా బడ్జెట్​ కోసం స్టాక్​ మార్కెట్​లు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎఫ్​ అండ్​ ఓ ట్రేడర్లకు ప్రతికూలంగా ప్రకటనలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. స్పెక్యులేవిట్​ ఎఫ్​ అండ్​ ఓలో రీటైలర్లు విపరీతంగా ట్రేడ్​ చేస్తున్నారని సెబీ, నిర్మలా సీతారామన్​, ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​లు అనేక మార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ బడ్జెట్​లో ఎలాంటి నిర్ణయాలు ఉండనున్నాయో చూడాలి.

Tue, 23 Jul 202412:16 AM IST

మధ్యతరగతి ప్రజల ఆశలు..

ప్రపంచంలో అత్యధిక పన్నులు ఉన్న దేశాల్లో భారత్​ ఒకటి. ఇక్కడ ట్యాక్స్​లతో ప్రజలు నలిగిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. పన్నులను తట్టుకోలేకే చాలా మంది సంపన్నులు దేశాన్ని విడిచి వెెళ్లిపోతున్నారు. అందుకే పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్​ పరిగణించారో లేదో చూడాలి.

Tue, 23 Jul 202412:14 AM IST

మోడీ 3.0 తొలి బడ్జెట్​..

2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి గత నెలలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కూటమిలోని ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి వచ్చింది. మరి ఈ దఫా బడ్జెట్​లో కూటమి పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్​ చేశారా? లేదా? అనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Tue, 23 Jul 202412:13 AM IST

నేడే బడ్జెట్​ 2024..

దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఘట్టానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మోదీ 3.0లో తొలి బడ్జెట్​ని ఇంకొన్ని గంటల్లో నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టనున్నారు. మధ్యతరగతి ప్రజల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఈ బడ్జెట్​పై భారీ ఆశలు పెట్టుకున్నారు.