Budget 2024 : భారతదేశ మెుదటి బడ్జెట్ ఎంతో తెలుసా? బడ్జెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు-budget 2024 interesting facts related to indias budget what was the first budget of india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 : భారతదేశ మెుదటి బడ్జెట్ ఎంతో తెలుసా? బడ్జెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు

Budget 2024 : భారతదేశ మెుదటి బడ్జెట్ ఎంతో తెలుసా? బడ్జెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు

Anand Sai HT Telugu

Budget 2024 : స్వాతంత్య్ర అనంతరం 1947-48 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బడ్జెట్ ఏంటో మీకు తెలుసా? మొదట బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో ఎప్పుడు విలీనం చేశారు?

బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు

భారతదేశ బడ్జెట్‌కు సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మెుదటి బడ్జెట్ ఎంతో తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947-48 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత ఇదే మెుదటి బడ్జెట్. ఆ సమయంలో మొత్తం దేశం బడ్జెట్ నేడు ఒక జిల్లా బడ్జెట్ కంటే తక్కువ లేదా దాదాపు సమానంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

1947-48లో రూ.197.1 లక్షల కోట్లుగా ఉన్న సాధారణ బడ్జెట్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.47.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఈ కాలంలో మొత్తం 24.187.81 రెట్లు పెరిగింది.

సమయం కూడా మారింది

అంతేకాదు.. గత కొన్నేళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం కూడా మారిపోయింది. అంతకుముందు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దీనిని 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముగం చెట్టి రూ.197.1 కోట్లతో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులూ ఉన్నారు

ఆర్థిక మంత్రికి బదులుగా ప్రధాని కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని లోక్‌సభ సెక్రటేరియట్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ డాక్యుమెంట్లలో ప్రధాని నెహ్రూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రస్తావన ఉంది. భారతదేశ తొలి ప్రధానిగా ఉన్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక శాఖను నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 1958-59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఇందిరాగాంధీ కూడా ప్రధానిగా ఉన్నప్పుడు 1969-70 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆ ఏడాది బడ్జెట్‌ను ఆయన సహచర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.

సాధారణ బడ్జెట్ లోకి రైల్వే బడ్జెట్

జులై 23, 2024 మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతారు. అయితే అత్యధికంగా 7సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. మెురార్జి దేశాయ్ రికార్డును బద్దలు కొడతారు. ఆయన పేరిట ఆరు బడ్జెట్ల రికార్డు ఉంది. సొంత ప్రత్యేక బడ్జెట్ ను కలిగి ఉన్న ఏకైక మంత్రిత్వ శాఖ రైల్వే. కానీ దీనిని 2017లో సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.

బడ్జెట్ లేఖ

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి రాజ్యసభలో బడ్జెట్ లేఖను కూడా సమర్పిస్తారు. అయితే బడ్జెట్‌ను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ఎగువ సభకు అధికారం లేదు. ఎగువ సభలో బడ్జెట్ పై చర్చ జరిగిన తర్వాత సభ బడ్జెట్‌ను లోక్‌సభకు పంపుతుంది. బడ్జెట్ చర్చ అనంతరం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కేటాయింపులు లేదా గ్రాంట్ల డిమాండ్ పై చర్చ జరుగుతుంది. గ్రాంట్ల డిమాండుపై చర్చ ముగిశాక, అటువంటి డిమాండ్లన్నింటినీ కలిపి ఒక ప్రక్రియ ద్వారా పంపుతారు.