NEET Row : నీట్ యూజీ పేపర్ లీకేజీపై లోక్‌సభలో ప్రతిపక్షాల ప్రశ్నలు.. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్
NEET Paper Leakage : నీట్ యూజీ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో ప్రతిపక్షం, అధికార పక్షం నడుమ మాటల యుద్ధం జరిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు కురిపించారు.
నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు సోమవారం విరుచుకుపడ్డాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రికి ఉన్న అవగాహనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 'నీట్‌లోనే కాదు, అన్ని ప్రధాన పరీక్షల్లోనూ పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని యావత్ దేశానికి స్పష్టమైంది. మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ నిందిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను.' అని పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి సెషన్‌లో రాహుల్ గాంధీ అన్నారు.
'ఇది (NEET Paper Leakage) ఒక పెద్ద సమస్య, ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఏమి చేస్తున్నారు?' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. కేకలు వేయడం వల్ల అబద్ధం నిజం కాదన్నారు. దేశంలో పరీక్షా విధానం అధ్వానంగా ఉందని ప్రతిపక్ష నేత అనడం అత్యంత ఖండనీయమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తూ.. ప్రశ్నపత్రం లీక్‌పై ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. కొన్ని కేంద్రాల్లో 2000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ మంత్రి ఉన్నంత వరకు విద్యార్థులకు న్యాయం జరగదన్నారు.
వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేస్తుంది. అయినప్పటికీ నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రం లీక్‌ను, వాట్సాప్ ద్వారా లీక్ అయిన ప్రశ్నపత్రం సర్క్యులేషన్‌ను అంగీకరించిందని నీట్-యూజీ అభ్యర్థుల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఎన్‌టీఏ శనివారం విడుదల చేసిన ఫలితాల విశ్లేషణలో ప్రశ్నపత్రం లీక్‌లు, ఇతర అవకతవకలతో లబ్ధి పొందిన అభ్యర్థులు ఫర్వాలేదనిపించారు. అయితే కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు సత్తా చాటారని తేలింది.
విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశంలోని 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5న విద్యార్థులు పరీక్ష రాశారు. పెద్ద ఎత్తున గోప్యతను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పుడు పరీక్షను రద్దు చేయడం ప్రతికూలంగా ఉంటుందని గతంలో కేంద్రం, ఎన్టీఏ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నాయి. లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపాయి. సోమవారంనాడు నీట్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.