తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari Floods : ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోదావరికి మరో మూడు రోజులు వరద ప్రవాహం

Godavari Floods : ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోదావరికి మరో మూడు రోజులు వరద ప్రవాహం

27 July 2024, 22:36 IST

google News
    • Godavari Floods : ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగనుందని అధికారులు తెలిపారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోదావరికి మరో మూడు రోజుల వరద ప్రవాహం
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోదావరికి మరో మూడు రోజుల వరద ప్రవాహం

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గోదావరికి మరో మూడు రోజుల వరద ప్రవాహం

Godavari Floods : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 53.8 అడుగుల నీటి మట్టం ఉందని అలాగే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.34 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని వివరిస్తూ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండలాల అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. సహాయక చర్యల్లో 3 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు ఎండీ రోణంకి కూర్మనాధ్ తెలిపారు.

13 వేల మంది పునరావాస శిబిరాలకు తరలింపు

అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 21,051 మందిని ఖాళీ చేయించినట్లు అలాగే 13,289 మందిని 82 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 273 మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు. 3,126 ఆహార ప్యాకెట్లు, 2.86 లక్షల వాటర్ ప్యాకెట్లు పంచినట్లు వెల్లడించారు.

భారీవర్షాలు, వరదలు కారణంగా శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 96 మండలాల్లో 525 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయని, మరో 230 గ్రామలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుత ప్రాథమిక నివేదికల ప్రకారం వ్యవసాయం 43,234 హెక్టార్లు, హార్టీకల్చర్ 2728.45 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. గోదావరి,కృష్ణాతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో నదుల్లో వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలు, కల్వర్టులకు, పడిపోయిన విద్యుత్ స్తంభాలకు, లైన్లకు దూరంగా ఉండాలన్నారు. వరద నీటిలో ప్రయాణాలు చేయరాదన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం, కన్నయ్యగుట్ట గ్రామాలలో వరద బాధితులను మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పార్థసారథి, వంగలపూడి అనిత పరామర్శించారు. వారికి ఆర్థిక సహయం చేసి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

రేపు(ఆదివారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తదుపరి వ్యాసం