AP Govt Employees : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, అదనంగా ఒక నెల జీతం అందజేత
28 June 2024, 14:43 IST
- AP Govt Employees : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల జీతం గౌరవ వేతనంగా ఉందించాలని నిర్ణయించింది.
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, అదనంగా ఒక నెల జీతం అందజేత
AP Govt Employees : ఏపీ సర్కార్ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ ఒక నెల అదనపు వేతనం చెల్లించాలని నిర్ణయించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం వేతనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సీఈవో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం ఇవ్వాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు రోజుల పనివిధానం మరో ఏడాది పొడిగింపు
మరో వైపు అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పనివిధానాన్ని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 27 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పొడిగించింది. సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. ఐదు రోజుల పనివిధానం జూన్ 27తో ముగియనుంది. అయితే ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
ఏపీ విభజన తర్వాత సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి ఐదు రోజుల పనివిధానం అమలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. ఈ గడువు నేటితో ముగియడంతో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది ఈ విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి పోస్టింగ్
ఏపీ ప్రభుత్వం తన హుందాతనాన్ని చాటుకుంది. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. వైసీపీ నేతలకు మద్దతు వ్యవహరించి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారని జవహర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లీవ్ పై వెళ్లిన ఆయనను ముందు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది. మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్యకు సైతం చంద్రబాబు సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పలువురు అధికారులు గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని, వారిపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, మాధవీలత, ధనుంజయ్ రెడ్డి, గోపాలకృష్ణ ద్వివేదిలను జీఏడీకి అటాచ్ చేసింది.