Pinnelli EVM Vandalised Case : పిన్నెల్లి వీడియో మేం విడుదల చేయలేదు - సీఈవో ఎంకే మీనా-ap ec ceo mukesh kumar meena said that we have not released the pinnelli evm vandalising video ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pinnelli Evm Vandalised Case : పిన్నెల్లి వీడియో మేం విడుదల చేయలేదు - సీఈవో ఎంకే మీనా

Pinnelli EVM Vandalised Case : పిన్నెల్లి వీడియో మేం విడుదల చేయలేదు - సీఈవో ఎంకే మీనా

Maheshwaram Mahendra Chary HT Telugu
May 23, 2024 03:50 PM IST

Macherla EVM Vandalised Case Updates : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియోపై ఏపీ సీఈవో ఎంకే మీనా కీలక వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల కమిషన్‌ నుంచి వీడియో బయటకు వెళ్లలేదని చెప్పారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు.

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం
మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం

AP CEO On EVM Vandalised Video : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నుంచి వీడియో బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు.

వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటున్నామని సీఈవో వెల్లడించారు. దర్యాప్తులో వీడియో ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుందన్న ఆయన.... ఈ ఘటనలో విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు, ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోందన్నారు.

వైసీపీ నుంచి ఈసీకి ప్రశ్నలు….

మాచర్ల నియోజక వర్గంలోని రెంట చింతల మండలం, పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సంబంధించిన వీడియోలు వెలుగు చూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పిన్నెల్లి పోలింగ్‌ స్టేషన్‌లో ఈవిఎంలను ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియోలు వెలుగు చూడటంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మాచర్లలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జరిగిన పరిణామాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మాచర్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరించిందనే దానిపై ఈసీకి ప్రశ్నలు వేశారు. పిన్నెల్లి వచ్చిన ఆరోపణలపై చట్టబద్ధంగా వ్యవహరించాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ లేవనెత్తే ప్రశ్నలకు ఎన్నికల సంఘం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

  • పాల్వాయి గేట్ పోలింగ్‌ బూత్‌ వీడియో అధికారిక వెబ్‌కాస్టింగ్ ద్వారా సేకరిస్తే అది ఎన్నికల సంఘం ప్రత్యేక ఆస్తి అవుతుందని, అది ఎలా లీక్ అయిందని సజ్జల ప్రశ్నించారు. 
  • వీడియో ప్రామాణికతను తనిఖీ చేయకుండా EC ఎందుకు అంత తొందరగా స్పందించిందని ప్రశ్నించారు.
  • మాచర్ల నియోజక వర్గంలో మొత్తం 7 ఈవీఎం ధ్వంసం అయ్యాయని ఎన్నికల కమిషన్‌ అంగీకరించిన వాస్తవం అయితే, వాటన్నింటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా ఈసీ ఎందుకు అడ్డుకుంటోందని అడిగారు. 
  • వీడియోలు బయటకు రాకుండా అడ్డుకోవడం ద్వారా దోషులను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఏమి చర్యలు తీసుకున్నారని సజ్జల ప్రశ్నించారు?
  • ఎన్నికల క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన అన్ని సందర్భాల్లో న్యాయమైన, నిష్పక్షపాత పద్ధతిలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈసీ నిష్పాక్షిక అంపైర్‌గా కమిషన్ పాత్రను నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ECని డిమాండ్ చేశారు.

మరోవైపు మాచర్ల నియోజక వర్గంలో పోలింగ్ రోజు జరిగిన ఘటనలకు సంబంధించిన వెబ్‌ కాస్టింగ్ వీడియోలను 14వ తేదీన ఆర్వో… పోలీసులకు అప్పగించారని ప్రధాన ఎన్నికల అధికారి మీనా స్పష్టం చేశారు. ఈవిఎంలు ధ‌్వంసమైన వెంటనే బెల్ ఇంజనీర్లు ఈవిఎంలను తనిఖీ చేసి వాటిలో డేటా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు.

మాచర్లలో 100శాతం వెబ్ కాస్టింగ్ జరిగిందని, ఈవిఎంలను పగులగొట్టిన చోట అందుకు సంబంధించిన ఫీడ్‌ను మొదట పోలీసులకు ఆ తర్వాత సిట్ అధికారులకు ఆర్వో అప్పగించారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనా స్పష్టం చేశారు. మే 13న జరిగిన పరిణామాల నేఫథ్యంలో పల్నాడు జిల్లా అధికారుల్ని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో రెండు రోజుల ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు.

 

Whats_app_banner