Pawan Kalyan : గతంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ ఉండేది, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో ఏపీకి రావాలంటే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భయపడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. యువగళం ముగింపు సభలో పాల్గొన్న పవన్...వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ ను కాంగ్రెస్ నేతలు జైలులో పెడితే... ఆ కక్షను చంద్రబాబు చూపించారని ఆరోపించారు. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపామన్నారు. 2019లో అభిప్రాయ భేదాలతో పొత్తు కుదరలేదని, ఆ గ్యాప్ లో జగన్ వచ్చారన్నారు.
"వైసీపీలో 25 ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారని తెలిసింది. మరో 80 మందిని మారుస్తున్నారు. కానీ మార్చాల్సింది అభ్యర్థులను కాదు సీఎం జగన్ ను. కూల్చివేతలతో జగన్ ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వం నీచ సంస్కృతిని మొదలుపెట్టింది. ప్రతిపక్ష నేతల ఇంట్లో మహిళలపై నీచంగా మాట్లాడారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎవరూ ఇంట్లో మహిళల గురించి మాట్లాడలేదు. జగన్ ఈ విష సంస్కృతి తీసుకొచ్చారు. తన ఇంట్లో అమ్మ, చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఇతర మహిళలకు ఎలా గౌరవం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు."- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ అన్నారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మార్పు తీసుకువస్తామని, జగన్ ను ఇంటికి పంపుతామన్నారు. ఇప్పటం సభలో చెప్పినట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉండి చంద్రబాబుకు ఎలా మద్దతు ఇస్తామని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ పెద్దలకు ఏపీలో రాజకీయ పరిస్థితులను వివరించానన్నారు.
నాకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు బాధగా ఉందని పవన్ అన్నారు. లోకేశ్ చేసింది జగన్ లాంటి పాదయాత్ర కాదన్నారు. వైసీపీ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, ముఖ్యమంత్రిని అన్నారు. సీఎం జగన్ కు ప్రజాస్వామ్యం విలువ తెలియదన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. వైపీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతారని? బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వారాహి యాత్రలో నాపై దాడులు చేశారని పవన్ ఆరోపించారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 వేల మహిళలకు మిస్ అయ్యారంటే నాపై విమర్శలు చేశారని, లెక్కలు లేకుండా తానేప్పుడు మాట్లాడనన్నారు.