Pawank Kalyan OSD: పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కేరళా క్యాడర్ ఐఏఎస్ కృష్ణతేజ మైలవరపు, డిప్యూటేషన్ కోరిన ఏపీ ప్రభుత్వం
Pawank Kalyan OSD: ఏపీ డిప్యూటీ సిఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఓఎస్డీగా కేరళా క్యాడర్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు డిప్యూటేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది.
Pawank Kalyan OSD: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కేరళా క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ రానున్నారు. సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన కృష్ణతేజ రెండ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళాలో జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
మంత్రులకు ఓఎస్డీలుగా గ్రూప్ వన్ స్థాయి అధికారులు, ఆర్డీఓలను నియమిస్తారు. ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ,శాస్త్ర సాంకేతిక రంగాలను ఆయన నిర్వహించనున్నారు.
కృష్ణ తేజ పనితీరుపై గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో పాటు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీ క్యాడర్‌కు పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖరాశారు.
కృష్ణతేజ కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, పర్యాటకశాఖ డైరెక్టర్‌గా , ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణతేజకు పవన్ అభినందనలు తెలిపారు. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.
2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ 2023 మార్చిలో త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కరోనాతో తల్లితండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారుల్లో కలెక్టర్ మామన్‌గా గుర్తింపు పొందారు. కరోనాలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడానికి చొరవ చూపించారు.
ఆయన పనితీరుపై విస్తృత గుర్తింపు రావడంతో పవన్ కళ్యాణ్ ఏరికోరి కృష్ణతేజను తన వద్ద పనిచేయాల్సిందిగా ఆహ్వానించారు. 9ఏళ్లలో ఐఏఎస్ అధికారిగా ఏమి చేయొచ్చో చేసి చూపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66ర్యాంకు సాధించారు. 2015లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ దక్కింది. అతి తక్కువ సర్వీస్ లోనే దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.
2018లో కేరళలో వరదలు అతలాకుతలం చేసినపుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు పేరుతో 48గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలెప్పీని వరదలు ముంచెత్తుతాయనే సమాచారంతో స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులతో కలిసి భారీ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉదంతంపై ఏకంగా సినిమా కూడా విడుదలైంది. ఆ తర్వాత వరద బాధితుల్ని ఆదుకోడానికి నిధుల సమీకరించి సహాయ చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖలో కూడా వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
అలెప్పీలో వెంబనాడ్ సరస్సును ఆక్రమించి నిర్మించిన రిసార్టుల్ని కూల్చేసి సంచలనం సృష్టించారు. స్థానికుల న్యాయపోరాటానికి అధికారులు ఎవరు సహకరించని సమయంలో కోట్ల ఖరీదు చేసే రిసార్టుల్ని జేసీబీలతో కూల్చి వేయించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. అతనిలాంటి అధికారి తన వద్ద ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి ఒప్పించారు. దీంతో కృష్ణతేజను ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు.