AP Govt Employees : రాజధాని పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు
27 June 2024, 22:12 IST
- AP Govt Employees : అమరావతి రాజధాని పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు
AP Govt Employees : అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. నేటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు.
మరో ఏడాది పొడిగింపు
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పొడిగించింది. సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. ఐదు రోజుల పనివిధానం ఇవాళ్టితో ముగియనుంది. అయితే ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
రాష్ట్ర విభజన తర్వాత
ఏపీ విభజన తర్వాత సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి ఐదు రోజుల పనివిధానం అమలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. ఈ గడువు నేటితో ముగియడంతో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది ఈ విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఏపీ రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను రాజధాని ప్రాంతానికి తరలించారు. అప్పటి వరకూ హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు అమరావతికి వచ్చి పనిచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఐదు రోజుల పనివిధానం కల్పించింది. ఈ విధానం ఇంకా అమలవుతుంది.