Bhongir MP Ticket 2024 : భువనగిరి సీటుపై 'హస్తం' నేతల కన్ను...! ఈసారి ఎవరికి దక్కబోతుంది...?
Bhongir Congress MP Ticket 2024 : భువనగిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లోని పలువురు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్ దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Bhongir Congress MP Ticket 2024 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరింస్తుండగా… త్వరగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) విజయం సాధించి అధికారంలోకి రావటంతో సరికొత్త జోష్ తో ఉన్న హస్తం పార్టీ… రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలవటమే టార్గెట్ గా పెట్టుకుంది. ఆదిలాబాద్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
భువనగిరి బరిలో ఎవరు…?
రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా…. పలు స్థానాలకు కాంగ్రెస్(Telangana Congress) పార్టీలో తీవ్ర పోటీ ఉంది. అందులో భువనగిరి కూడా ఒకటిగా ఉంది. బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తుంగతుర్తి, నకిరేకల్ లో ఎస్సీ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండగా… మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీసీల ఓట్ల శాతం అత్యధికంగా ఉంది. ఈ సీటు కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy)కి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా పేరుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. అయితే భువనగిరి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. బీసీల ఓట్లు కలిసివస్తాయని అంచనా వేసుకుంటున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్నా కైలాస్ నేత కూడా భువనగిరి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ పోటీ చేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదని…. బీసీ సామాజికవర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని హైకమాండ్ ను కోరుతున్నారు. వీరే కాకుండా కోమటిరాజగోపాల్ రెడ్డి సతీమణిని కూడా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. దీంతో ఇక్కడ్నుంచి టికెట్ దక్కితే సులభంగా విజయం సాధించవచ్చని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ టికెట్ ఖరారు విషయంలో మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయం కీలకం కాబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
2009 పార్లమెంట్ ఎన్నికల్లో(Loksabha elections 2024) కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ్నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసి…. విక్టరీ కొట్టారు. ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు.
సంబంధిత కథనం