Bhongir constituency : భువనగిరి ఖిల్లా ఎవరిది?-నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ను ఊరిస్తున్న విజయం
Bhongir constituency : నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి భువనగిరి నియోజకవర్గంలో విజయం లేదు. ఈసారి ఆ లోటును భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ఎత్తులు వేస్తుంది.
Bhongir constituency : నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ను ఊరిస్తున్న భువనగిరి ఖిల్లా ఈసారి ఆ పార్టీకి దక్కుతుందా? రెండు ఉపఎన్నికలు సహా మొత్తంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో వామపక్షాలు మూడు పర్యాయాలు గెలిస్తే.. కాంగ్రెస్ అయిదు సార్లు విజయాలు సాధించింది. టీడీపీ ఏకంగా వరసగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేస్తే.. బీఆర్ఎస్ వరసగా రెండు సార్లు గెలిచింది. 2023 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్, ఈసారి విజయం ద్వారా నలభై ఏళ్ల కిందట చేజారిన భువనగిరి ఖిల్లాను తిరిగి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.
టీడీపీ రికార్డు విజయాలు
భువనగిరి నియోజకవర్గానికి 1952లో తొలి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పై విజయం సాధించారు. ఆయన అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. 1952లోనే జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన రావి నారాయణ రెడ్డి చేతనే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. దేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఆయన తెచ్చుకున్నారు. 1957లో మరోసారి రావి నారాయణ రెడ్డి భువనగిరి అసెంబ్లీ స్థానం గెలిచారు. 1962లో సీపీఐ నుంచి ఆరుట్ల రామచంద్రారెడ్డి గెలిస్తే.. 1967, 1972 వరస ఎన్నికల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత జరిగిన 1978, 1983 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. కె.నర్సింహారెడ్డి కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు.
1983లో ఉమ్మడి రాష్ట్రమంతా టీడీపీ అధినేత ఎన్.టి.రామారావు గాలి వీచినా ఇక్కడ కాంగ్రెస్ గెలవడం విశేషం. అయితే, 1983లో విజయం తర్వాత ఇప్పటి వరకు అంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్ మళ్లీ గెలవలేదు. 1985 నుంచి 2009 వరకు ఒక ఉపఎన్నిక సహా ఏడు ఎన్నికలు జరిగితే ఏడు సార్లూ టీడీపీని విజయాలు వరించాయి. ఎలిమినేటి మాధవరెడ్డి నాలుగు సార్లు, ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడు సార్లు గెలిచి రికార్డు నమోదు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ఉనికి, ఊసు లేకుండా పోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలిఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ చేసింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున పైళ్ల శేఖర్ రెడ్డి తొలి విజయాన్ని నమోదు చేశారు. 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలని శేఖర్ రెడ్డి శ్రమిస్తుంటే.. నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న విజయంతో చేజారిన భువనగిరిని దక్కించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు.
వివాద రహితుడన్న పేరుతో ఓటర్లలోకి పైళ్ల
బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి వివాద రహితుడన్న పేరుండడం ఆ పార్టీకి అనుకూల అంశంగా మారింది. రెండు టర్ములుగా ఆయన పనితీరును గమనిస్తున్న ప్రజలను మూడోసారి కూడా పట్టంగడతారని ఆశపడుతున్నారు. ప్రభుత్వ నిధుల మంజూరీతో నిమిత్తం లేకుండా సొంత నిధులతో కొన్ని పనులను పూర్తిచేయడాన్ని ప్రధానంగా ప్రచారంలో ఓటర్లకు చేరవేస్తున్నారు. మూసీ కాలుష్యంతో పాటు, ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండే ఈ ప్రాంతంలో సొంత ఖర్చులతో వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు నెలకొల్పిన పైళ్ల శేఖర్ రెడ్డి మరికొన్ని పనులనూ తన సొంత డబ్బుతోనే చేపట్టారని చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయన్న అంచనాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో హెచ్.ఎం.డి.ఎ నిధులతో చేపట్టిన పనుల కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. బీబీనగర్ నిమ్స్ ను కేంద్రంతో కొట్లాడి ఎయిమ్స్ గా మార్పించడం, భునగిరిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం వంటి అంశాలు అనుకూలంగా భావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానిక నినాదంతో.. ప్రజల్లోకి కుంభం
2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సారి విజయంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. స్థానికుడినన్న నినాదంతో ఆయన ఓటర్లలోకి వెళుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పొరుగున ఉన్న ఆలేరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, స్థానికుడినైన తనని ఆదరించాలని కోరుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోయాయని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి ఇప్పటికీ సురక్షితమైన తాగునీటిని ప్రభుత్వం అందించలేకపోతోందని, మిషన్ భగీరథ నీరు ఇంటింటికి కాదుగదా, కనీసం వీధి వీధికన్నా రావడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. దీంతోపాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అనుకూల అంశమన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఆరు గ్యారెంటీ స్కీములపై ఆధారపడుతున్న కాంగ్రెస్ తమ అభ్యర్థి స్థానికుడన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తోంది.
బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించినా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగుతోంది. పోటీలో ఇంకా సీపీఎం, బీఎస్సీలు ఉన్నా అవి నామమాత్రపు పోటీకే పరిమితం కానున్నాయి. మొత్తంగా మూడో సారి గెలవాలని బీఆర్ఎస్, నలభై ఏళ్ళుగా ఊరిస్తున్న విజయాన్ని ఈ సారి పొందాలని కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )