Yadadri : భక్తులకు మరో శుభవార్త.. కొండపై కూడా 'స్నాన సంకల్పం', టికెట్ తీసుకుంటే ప్రత్యేక దర్శనంతో పాటు ఫ్రీగా లడ్డూ..!-vishnu pushkarini reopen on the hill at yadadri ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri : భక్తులకు మరో శుభవార్త.. కొండపై కూడా 'స్నాన సంకల్పం', టికెట్ తీసుకుంటే ప్రత్యేక దర్శనంతో పాటు ఫ్రీగా లడ్డూ..!

Yadadri : భక్తులకు మరో శుభవార్త.. కొండపై కూడా 'స్నాన సంకల్పం', టికెట్ తీసుకుంటే ప్రత్యేక దర్శనంతో పాటు ఫ్రీగా లడ్డూ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 14, 2024 05:01 PM IST

యాదాద్రి వెళ్లే భక్తులకు దేవదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో కూడా సంకల్ప స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించింది. కొన్నేళ్ల తర్వాత… ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు ధరలను నిర్ణయించారు.

యాదాద్రి కొండపై స్నాన సంకల్పం ప్రారంభం
యాదాద్రి కొండపై స్నాన సంకల్పం ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… యాదాద్రిలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొండపైకి ఆటోల అనుమతించటం, భక్తులు నిద్ర చేసే అవకాశాలను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా….అరుణాచలం తరహాలోనే గిరి ప్రదక్షిణలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

యాదాద్రి పేరును కూడా యాదగిరిగుట్టగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటికే కీలక ప్రకటనలు కూడా చేశారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ఇదిలా ఉంటే… భక్తులకు దేవదాయశాఖ శుభవార్త చెప్పింది. కొండపైన కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశాన్ని పునరుద్ధరించింది.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన పుష్కరిణిలో స్నానాలు చేయటాన్ని నిషేదించారు. ఆ తర్వాత కొండ కిందనే పుష్కరిణిని(లక్ష్మీపుష్కరిణి) ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి… కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం కొండ కింద మాత్రమే కాకుండా… పైన ఉన్న విష్ణు పుష్కరిణిలో కూడా పుణ్య స్నానాలను ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవలనే కొండపై స్నాన సంకల్పానికి శ్రీకారం చుట్టారు.

రూ. 500 టికెట్ ధర

కొండపైన ఉన్న విష్ణుపుష్కరిణిలో చేసే స్నాన సంకల్పానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రూ. 500గా టికెట్ ధరను నిర్ణయించారు. ఈ టికెట్ తీసుకుంటే కేవలం స్నాన సంకల్పం మాత్రమే కాదు… స్వామివారి ప్రత్యేక దర్శన సదుపాయం, ఉచితంగా స్వామివారి లడ్డూ కూడా అందజేయనున్నారు. టికెట్ లేని భక్తులకు కేవలం పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు మాత్రమే అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

గిరిప్రదక్షిణ సేవలు కూడా….

అరుణాచలం తరహాలోనే యాదగిరిగుట్టలోనూ 'గిరి ప్రదక్షిణ' సేవ అందుబాటులోకి వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ క్రతువు ప్రారంభం కాగా… ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలిచింది.

జూన్ 18, 2024న తొలిసారిగా యాదాద్రి ఆలయంలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.

యాదాద్రీశుడి ఆలయం చుట్టూ ఐదున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిని ఏర్పాటు చేశారు. ఫలితంగా వేలాది వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశం లభించింది. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లభించింది. ఏ మాత్రం ఇబ్బుదుల తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు.

అరుణాచలంలో చూస్తే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాత్రం గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలో ఉన్న ఆలయాల్లో గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం రికార్డుల్లోకి ఎక్కింది. ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు యాదాద్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు భక్తుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.