Yadadri Name Change : 'యాదాద్రి' పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా..?-telangana government is likely to change the name of yadadri temple as yadagirigutta ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Name Change : 'యాదాద్రి' పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా..?

Yadadri Name Change : 'యాదాద్రి' పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 03, 2024 08:26 AM IST

Yadadri Temple Name Change: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యాదగిరిగుట్ట పేరు యాదాద్రిగా మారిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… తిరిగి పాత పేరునే తెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

యాదాద్రి
యాదాద్రి (https://ytda.in/)

Yadadri Temple Name Change: యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా…? కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం… ఆ దిశగా ఆలోచన చేస్తుందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వస్తాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేనే కాదు…. జిల్లాకు చెందిన కీలక మంత్రి కూడా స్పష్టం చేశారు. దీంతో… యాదాద్రి పేరు మారటం ఖాయమే అన్న చర్చ జోరందుకుంది.

యాదాద్రిగా యాదగిరిగుట్ట…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చిన కేసీఆర్… యాదగిరిగుట్ట అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించటంతో పాటు YTDA(YADAGIRIGUTTA TEMPLE DEVELOPMENT AUTHORITY)ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. 1200 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో పునర్ నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్ నిర్మాణాన్ని మొదలు పెట్టగా….2022లో పూర్తి అయ్యాయి. ప్రధానాలయం పునర్ నిర్మాణ పనులు ఉండటంతో…. 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తుల దర్శనాలు అనుమతిచ్చారు. చాలారోజుల పాటు ఇక్కడే దర్శనాలను ఏర్పాటు చేయగా… 2022 నుంచి ప్రధాన ఆలయంలోకి అనుమతి ఇస్తున్నారు. పునర్ నిర్మాణంలో భాగంగా… యాదగిరిగుట్టగా ఉన్న పేరును యాదాద్రిగా మార్చారు. అప్పట్నుంచి ఆ ఆలయ పేరు యాదాద్రిగా అమల్లోకి వచ్చింది. ఇదే పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.

మళ్లీ పాత పేరు…!

యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే(ఆలేరు) బీర్ల ఐలయ్య చెప్పారు. త్వరలోనే యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుతుందని… ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న విధానాలను అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం నిర్ణయించారని తెలిపారు. క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తామని వివరించారు. కొండ పై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు.

స్థానిక ఎమ్మ్మెల్యేతో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి కూడా యాదాద్రి పేరు మార్పుపై కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో…. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.

మరోవైపు కొద్దిరోజులుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించారు. ఆలయన పునర్ నిర్మాణం తర్వాత… కొండపైకి ఆటోలు వెళ్లకుండా నిషేధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆటోలు కొండపైకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ఇందులో భాగంగా… ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తున్నాయి. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. షిఫ్టుకు 50 ఆటోలు చొప్పున రాకపోకలు కొనసాగిస్తున్నాయి. 25 ఆటోలు కొండపైన ఉంటే, మరో 25 కొండ కింద ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.  ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.