TRS Alliance : 2023 ఎన్నికల్లో కేసీఆర్ పొత్తుల రాజకీయం.. సీట్ల సెటిల్​మెంట్ ఖతమ్?-trs looks to the left parties for 2023 election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Alliance : 2023 ఎన్నికల్లో కేసీఆర్ పొత్తుల రాజకీయం.. సీట్ల సెటిల్​మెంట్ ఖతమ్?

TRS Alliance : 2023 ఎన్నికల్లో కేసీఆర్ పొత్తుల రాజకీయం.. సీట్ల సెటిల్​మెంట్ ఖతమ్?

Anand Sai HT Telugu
Aug 25, 2022 02:31 PM IST

2023 Assembly Election : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తులతో వెళ్లనుందా? రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సింగిల్ గా ఎన్నికలు కొట్టిన.. గులాబీ పార్టీకి ఇప్పుడేమైంది? పొత్తులపై ఎందుకంత ఆలోచన చేస్తుంది? ఇంతకీ కేసీఆర్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు?

<p>కేసీఆర్</p>
కేసీఆర్ (HT_PRINT)

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇలాంటి సమయంలో రాబోయే ఎన్నికలపై కేసీఆర్ ఇప్పటి నుంచే కరసత్తు చేస్తున్నారు. సర్వేలు.. రిపోర్టులు.. ఇలా ప్రతీ నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ ఇంతకుముందుకులా కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో వెళ్లాలని టీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

గతంలోనూ జరిగిందలా..

2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పొత్తులపై టీఆర్‌ఎస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల పొత్తులు పెట్టుకుంది టీఆర్ఎస్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్‌ఎస్ సొంతంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేసింది. 2004లో కాంగ్రెస్, వామపక్షాలతో ఎన్నికల ముందు పొత్తు బాగానే పని చేయగా, 2009లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టి ఘోర పరాజయం పాలైంది.

ముందస్తు పొత్తు

2023 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు పొత్తుల విషయంపై టీఆర్‌ఎస్ నాయకత్వం, వామపక్షాల నేతల మధ్య ఇటీవల చర్చ జరిగింది. రానున్న మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతిస్తున్నట్టుగా తెలిసిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముందస్తు పొత్తులపై టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘ముందస్తు ఎన్నికల పొత్తు’లో భాగంగా వామపక్షాలకు వదిలేయాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సీపీఐ, సీపీఎం నేతలు సమర్పించినట్లు సమాచారం. దీనిపై టీఆర్‌ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించి మునుగోడు ఉప ఎన్నికల తర్వాత చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిగో సీట్ల సెటిల్​మెంట్!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం, నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి స్థానాలను సీపీఐ కోరినట్లు సమాచారం. హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి సీటు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ సీటును కూడా వామపక్షాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.

నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తమ పార్టీకి బలమైన క్యాడర్ బేస్ ఉందని సీపీఎం ఏడెనిమిది స్థానాలను కోరినట్లు సమాచారంగా తెలుస్తోంది. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఆధీనంలో ఉండడంతో వామపక్షాల ఎత్తుగడలతో అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకత్వం తమ స్థానాలను ఒకవేళ వామపక్షాలకు వదిలివేస్తే తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

ఆల్ రెడీ చెప్పేశారుగా..

ఇటీవలే మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. విభజన శక్తులను ఓడించేందుకు రానున్న ఎన్నికల్లో వామపక్షాలు, ఇతర ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేసేందుకు టీఆర్‌ఎస్ సుముఖంగా ఉందని కేసీఆర్ ప్రకటించారు. అది మునుగోడు ఉప ఎన్నికలకే పరిమితం కాదని ఆయన మాటల్లో అర్థమైపోయింది.

' రైట్'ని ఓడించెందుకు లెఫ్ట్

2014లో రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కోసం గులాబీ పార్టీ ముందస్తు ఎన్నికల పొత్తులను ఏర్పాటు చేసింది. 2004లో TRS, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మధ్య ఎన్నికల ముందు సంకీర్ణం విజయవంతమైంది. 2009 విషయం వచ్చేసరికి.. టీడీపీ, వామపక్ష పార్టీలతో జతకట్టాలన్న పార్టీ నిర్ణయం విఫలమైంది. మునుగోడు ఉపఎన్నికల వరకే కాకుండా 2023లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఎదుర్కోనేందుకు వామపక్షాలతో వెళ్లడమే మంచిదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది.

Whats_app_banner