Munugodu: కేసీఆర్ వ్యూహం మారిందా..? వాటిపైనే ఎందుకు ఫోకస్ చేశారు..?-trs president kcr changed the plan in munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu: కేసీఆర్ వ్యూహం మారిందా..? వాటిపైనే ఎందుకు ఫోకస్ చేశారు..?

Munugodu: కేసీఆర్ వ్యూహం మారిందా..? వాటిపైనే ఎందుకు ఫోకస్ చేశారు..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 21, 2022 09:31 AM IST

మునుగోడు గడ్డపై కేసీఆర్ గర్జించారు. కేవలం బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. అయితే హుజురాబాద్ కు భిన్నంగా ఇక్కడ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇప్పుడు ఇదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వ్యూహం మార్చారా..?లేక ప్లాన్ లో భాగంగానే పావులు కదుపుతున్నారా అన్న చర్చ మొదలైంది.

<p>టీఆర్ఎస్ అధినేత కేసీఆర్</p>
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (twitter)

cm kcr startgey on munugodu bypoll: మునుగోడు.... పొలిటికల్ యుద్ధానికి కేరాఫ్ అడ్రస్..! అన్ని రాజకీయ పార్టీల చూపు ఇటువైపే..! ప్రతి మండల కేంద్రంలోనూ కీలక నేతలు మోహరించారు. నెమ్మదిగా అగ్రనేతలు వచ్చేస్తున్నారు. ఇక యుద్ధంలో ఒక అడుగుముందుకు వేసేసింది టీఆర్ఎస్. ఆ పార్టీ అధినేత మునుగోడు గడ్డపై అడుగుపెట్టి సమరశంఖాన్ని పూరించారు. బీజేపీ టార్గెట్ గా గర్జించారు. మోటర్లకు మీటర్ల అంటూ... తెగ వాయించేశారు. అయితే మునుగోడులో కేసీఆర్ స్పీచ్ అంతా... పొలిటికల్ అంశాల చుట్టే తిరిగింది. హామీలు లేవు... వరాల జల్లు సప్పుడు లేదు..! అయితే కేసీఆర్ వరాలుజల్లు ఎందుకు కురిపించలేదు..? కేవలం రాజకీయ విమర్శల వరకే ఎందుకు పరిమితం అయ్యారు..? మరో సభతో ముందుకొస్తారా..? అసలు కేసీఆర్ నయా వ్యూహామేంటన్న చర్చ అందరిలోనూ మొదలైంది.

మునుగోడు ఉప ఎన్నికపై ఇప్పటికే చర్చలు, సమావేశాలు, దిశానిర్దేశంతో సరిపెట్టిన కేసీఆర్... శనివారం ప్రజా దీవెన సభకు హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే స్వయంగా కేసీఆర్ రావటంతో.... నియోజకవర్గంలోని సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తారని, హామీలు, వరాలజల్లు కురిపిస్తారని అందరూ భావించారు. హుజురాబాద్ లో తరహా లోనే మునుగోడుకు కూడా భారీ స్థాయిలో నిధులు ఇచ్చే ఛాన్స్ ఉందన్న భావన అందరిలోనూ ఉండే..! కానీ కేసీఆర్ అలా చేయలేదు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు..వరాలు ప్రకటించలేదు. క్లియర్ కట్ గా బీజేపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేసేశారు. ఉప ఎన్నిక వచ్చిందంటూ ప్రశ్నిస్తూ.... కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. గోల్ మాల్ ఉప ఎన్నిక తెచ్చారంటూ ఫైర్ అయ్యారు.

పదే పదే ప్రస్తావన....

శనివారం నాటి టీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేసీఆర్.... మొత్తంగా బావుల వద్ద మోటర్లకు మీటర్లు,కరెంట్ సరఫరా, రైతుబంధు, బీమా అంశాలనే పదేపదే ప్రస్తావించారు. జాతీయ స్థాయి అంశాలను ప్రస్తావిస్తూనే.... వీటిని నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీకి ఓటు పడుతుందంటే... బావి దగ్గర మోటర్ కు మీటర్ పడినట్లే అన్నారు. ప్రసంగం మొదలు నుంచి... చివరి వరకు సందర్భానికి తగ్గట్టు కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఇక కరెంట్ విషయంలోనూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతుబంధు, బీమా వంటి ఇస్తూ రైతన్నలకు అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఉన్నంత వరకు... రైతుబంధు, బీమా పథకాలు ఆగవని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే మాత్రం.... మోటర్లు మీటర్లు బిగించటం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు. మునుగోడులో అనూహ్యమైన ఫలితం రావాలని పిలుపునిచ్చారు. ఇక కృష్ణా జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ... అమిత్ షాను సూటిగా ప్రశ్నించారు. మునుగోడు బీజేపీ సభలో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలని లైట్ గా తీసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్. కేవలం ఒక్క డైలాగ్ తోనే సరిపెట్టేశారు. ఈ పరిణామం కూడా చర్చనీయాంశంగా మారింది.

వ్యూహాం మార్చారా...?

కేసీఆర్ ప్రసంగంపై చర్చ మొదలైంది. హామీలు, వరాల అంశాలను పూర్తిగా పక్కనబెట్టి రాజకీయ అంశాలపైనే కేసీఆర్ ఫోకస్ చేయటం వ్యూహాంలోనే భాగమని తెలుస్తోంది. మోటర్లకు మీటర్లు, కరెంట్ సరఫరా, రైతుబంధు వంటి అంశాలను ప్రస్తావించటం వెనక కేసీఆర్ ఓ క్లారిటీతోనే ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులను తమ వైపు తిప్పుకోవాలని కేసీఆర్ చూశారనే టాక్ వినిపిస్తోంది. అయితే మరోసారి చండూరులో సభ పెట్టుకుందామంటూ ఓ ప్రకటన చేశారు. అయితే ఈ విషయంలో కూడా పక్కా ప్లాన్ ఉందనే వాదన వినిపిస్తోంది. మునుగోడు సభను కేవలం పొలిటికల్ అంశాలతోనే సరిపెట్టి... నెక్ట్స్ తలపెట్టబోయే సభలో హామీలు, వరాలు కురిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ సమయంలోపు ప్రతిపక్ష పార్టీల అడుగులు, వ్యూహాలను అంచనా వేసి.... ప్రతివ్యూహాలను రచించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా కేసీఆర్ సభతో అసలు సిసలైన వార్ మునుగోడులో స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఆదివారం బీజేపీ సభ ఉండటం.. అమిత్ షా రానుండటంతో ఆయన ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ఎలాంటి జవాబు ఇస్తారనే చర్చ నడుస్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాబోయే రోజుల్లో మునుగోడు వార్… మరో లెవల్ కు చేరుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది.

Whats_app_banner