Munugodu: బీజేపీ సమరభేరి సభ.. కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఉంటుందా..?
bjp munugodu samara bheri: రేపటి మునుగోడు సభకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండటంతో… ఆసక్తి నెలకొంది. ఈ సభ వేదికగా కేసీఆర్ వ్యాఖ్యలకు అమిత్ షా ఎలాంటి కౌంటర్ ఇస్తారన్న చర్చ మొదలైంది.
BJP Meeting in Munugodu: మునుగోడులో అసలు యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు నేతల మధ్య మాటల యుద్ధం నడిస్తే... ఇకపై అగ్రనేతలు ఎంట్రీ ఇచ్చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రారంభంకాగా... ఆదివారం మునుగోడు సభలో ఉప ఎన్నికకు సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతోంది కమలదళం. రాజగోపాల్ రెడ్డి చేరే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో... మునుగోడులో అసలు సిసలైన వార్ మొదలైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఆదివారం (ఆగస్టు 21) మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి, నిరంకుశ పాలనను సమాధి చేయడంలో ఈ సభ దిశానిర్దేశం చేస్తుందని తరుణ్ చుగ్ ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎనిమిదేళ్ల దుష్టపాలనపై ఆగ్రహంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి... భారీగా తన అనుచరులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం టీఆర్ఎస్ తలపెట్టిన సభ కంటే... పెద్ద ఎత్తున జనాలను తరలించాలని చూస్తున్నారు.
స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందా...?
ప్రజా దీవెన సభ పేరుతో మునుగోడులో గర్జించారు కేసీఆర్. బీజేపీ సర్కార్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ సర్కార్ గద్దె దించాలని... మునుగోడులో కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక కృష్ణా జలాల విషయంలో... సూటిగా ప్రశ్నించారు. తమ వాటా విషయంపై ఎందుకు ప్రకటన చేయటం లేదని... దీనిపై మునుగోడులో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం చేశారని మునుగోడుకు వస్తున్నారని నిలదీశారు. బావుల వద్ద మోటర్ల అంశాన్ని కేసీఆర్ బలంగా ప్రస్తావించారు. ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తేలేదంటూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో... రేపటి సభలో అమిత్ షా ప్రసంగం ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. కేసీఆర్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తారా..? ఏ అంశాలను ప్రస్తావిస్తారు..? చేరికల విషయంలో ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా వంటి ప్రశ్నలపై చుట్టు చర్చ నడుస్తోంది.
ఈ సభతోనే మునుగోడు బైపోల్ ప్రచారానికి సమరశంఖం పూరించాలని చూస్తోంది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి అధికారికంగా చేరటం పూర్తి అయితే... పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టనున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా ల్యాండ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సభ తర్వాత అమిత్ షా... రాష్ట్ర నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్ అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.... రేపటి బీజేపీ మునుగోడు సభ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది.