Munugodu: మీటర్లు పెట్టే మోదీ కావాలా… వద్దనే కేసీఆర్ కావాలా..?-kcr speech in trs public meeting at munugodu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Speech In Trs Public Meeting At Munugodu

Munugodu: మీటర్లు పెట్టే మోదీ కావాలా… వద్దనే కేసీఆర్ కావాలా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 20, 2022 04:58 PM IST

kcr public meeting in munugodu: మునుగోడులో తలపెట్టిన ప్రజా దీవెన సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. నల్గొండ నగారా పేరుతో ఫ్లొరైడ్ సమస్యపై జిల్లా మొత్తం తిరిగానని గుర్తు చేశారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎవర్ని ఉద్ధరించేందుకు అని ప్రశ్నించారు. దేశంలో ప్రగతి శీల భావాలు కలిగిన వారితో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ (ఫైల్ ఫొటో)
కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

TRS praja deevena sabha at munugode:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. మునుగోడులో తలపెట్టిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఆయన... మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో ఏ ఒక్కరికి మంచి జరగలేదని దుయ్యబట్టారు. అధికార అహంకారంతో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశ ప్రజానీకానికి మంచి జరగాలంటే, మీటర్లు పెట్టవద్దంటే బీజేపీకి మీటరు పెట్టాలంటూ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కోక్కరు కేసీఆర్ కావాలన్నారు. ఇది పార్టీల ఎన్నిక కాదని... బతుకుదెరువు ఎన్నిక అని చెప్పారు.

'నాడు నల్గొండ జిల్లా మొత్తం తిరిగా. ఫ్లొరైడ్ సమస్యను నాడు ఎవరు పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ప్లొరైడ్ పేరుతో మంచినీళ్లను అందిస్తున్నాం. నాడు శివన్నగూడెంలో నిద్ర కూడా చేశాను. ఈ గోల్ మాల్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మద్దతు ప్రకటించిన సీపీఐకి ధన్యవాదాలు. ప్రగతిశీల శక్తులను ఏకం చేస్తాం. రేపు మునుగోడుకు అమిత్ షా వస్తున్నాడు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం వైఖరి ఏంటో అమిత్ షా సమాధానం చెప్పాలి. బొమ్మలు పెట్టి స్వాగతం పలకటం కాదు... మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో ఎందుకు వాటా తేల్చరో చెప్పాలి. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదు. దేశంలోని అన్నింటిని అమ్మేస్తన్నారు. వారు గెలిస్తే బావుల దగ్గర మోటర్లుకు మీటర్లు పెడుతారు. మనం రైతుబంధు, బీమా ఇస్తున్నాం. ఒక్క మునుగోడులోనే 1100 మందికిపైగా రైతు బీమా అందజేశాం' అని కేసీఆర్ అన్నారు.

మునుగోడులో వచ్చింది ఉపఎన్నిక కాదు... జీవితాల ఎన్నిక, బతుకుదెరువు ఎన్నిక అంటూ కేసీఆర్ ప్రసంగించారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా- వద్దనే కేసీఆర్ కావాలా అని అడిగారు. దీనిపై గ్రామాల్లో చర్చ జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీతో కొట్లాడుతున్నానని... అందుకు కారణం ప్రజలే అంటూ వ్యాఖ్యానించారు.తనని పడగొడితే బావులకు మీటర్లు పెడుతారని చెప్పారు. గతంలో మునుగోడులో డిపాజిట్ రాలేదని...ఈసారి కూడా రావొద్దని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు పడితే... బావి దగ్గర మీటరు పడుతదని అని చెప్పుకొచ్చారు. ఏమైనా అంటే ప్రభుత్వాలను పడగొడుతాం, ఏక్ నాథ్ షిండేలను తీసుకొస్తామంటూ మాట్లాడుతున్నారని... వారికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

బీజేపీకి మీటరు పెట్టాలి...

'బావుల దగ్గర మీటరు పెడుతున్న బీజేపీకి కూడా మనం మీటరు పెట్టాలి. మునుగోడులో వచ్చింది పార్టీల ఎన్నిక కాదు. బతుకుదెవురు ఎన్నిక. రైతుల ఎన్నిక. దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఇవ్వటం లేదు. ఉపఎన్నిక తెచ్చిన గోల్ మాల్ గాళ్లకు మీటరు పెట్టాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ మీ దీవెన ఉన్నంత వరకు రైతాంగానికి మీటరు పెట్టనివ్వం. రైతు బంధు, బీమా ఆగదు. బోరుకు దండం పెట్టి రైతులు ఓటు వేయాలి. మహిళలు గ్యాస్ కు దండం పెట్టి ఓటు వేయాలి. గ్యాస్ ధర తిరిగి రావాలంటే... బీజేపీని తరిమికొట్టాలి. పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని దించాలి' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో…

బలంలోనే రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను పడగొడుతామని అంటున్నారు. తమిళనాడు, బెంగాల్ లోనూ ప్రయత్నాలు చేశారు. ఈడీని పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో. నేను భయపడేది లేదు. నువ్వు నన్ను గోకపోయినా... నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటాను. మోదీ గర్వమే ఆయనకు శత్రువు అవుతుంది. అధికారం అనేది శాశ్వతం కాదు. దేశ రాజధాని ఢిల్లీలోనే సరిగా నీళ్లు, కరెంట్‌ లేని పరిస్థితి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ కరెంట్‌ లేదు. తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ కు ఓటు వేస్తే కనగల్ చెరువులో పడినట్లే అంటూ కేసీఆర్ సెటైర్లు విసిరారు. మునుగోడులో అనూహ్యమైన ఫలితాలు రావాలని అన్నారు. తర్వాతి సభ చండూరులో నిర్వహిస్తామని చెప్పారు.

IPL_Entry_Point