CPI Supports TRS : మునుగోడులో టిఆర్‌ఎస్‌కు సిపిఐ మద్దతు
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతో మునుగోడులో ఉపఎన్నిక బలవంతంగా ప్రజలపై రుద్దారని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. అనివార్య పరిస్థితుల్లో మతోన్మాద బీజేపీని ఓడించడానికి టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సిపిఐ ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో ఒక్క దానిని కూడా బీజేపీ నెరవేర్చలేదని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు వంటి హామీలను బీజేపీ విస్మరించిందని ఆరోపించారు.
బీజేపీపై జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ పోరాడుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రగతిశీల శక్తులు, లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని సిపిఐ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సిపిఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని కోరారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు భవిష్యత్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ సిపిఐ, సిపిఎం, వామపక్షాలు కలిసి ముందుకు సాగాలనే ఆలోచన ఉందని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికకు మాత్రమే పరిమతం కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి ముందుకు
2018లో కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు తమను చివరి వరకు ముచ్చెమట్లు పట్టించారని ఆరోపించారు. కలిసి కూర్చోని మాట్లాడటానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏర్పాటు చేసిన మహా కూటమి ఏమైందో అంతా చూశారన్నారు. టిఆర్‌ఎస్‌పై కూడా తాము గతంలో పోరాటాలు చేశామని, పోడు భూములు, ఇళ్ల స్థలాలు ఆసరా పెన్షన్లపై కూడా పోరాటాలు చేశామని, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజా సమస్యల మీద పోరాడే విషయంలో ఎలాంటి రాజీ వైఖరి ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎదురయ్యే పరిస్థితులు ఉండటంతోనే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.