Munugode by election: గెలిచేదెవరు..? నిలిచేదెవరు..? కీలకంగా మునుగోడు ఉప ఎన్నిక…-munugode by poll may become costliest election ever in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode By Election: గెలిచేదెవరు..? నిలిచేదెవరు..? కీలకంగా మునుగోడు ఉప ఎన్నిక…

Munugode by election: గెలిచేదెవరు..? నిలిచేదెవరు..? కీలకంగా మునుగోడు ఉప ఎన్నిక…

B.S.Chandra HT Telugu
Aug 19, 2022 11:12 AM IST

Munugode by election: మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటాలని బీజేపీ, పట్టు నిలుపుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్‌ కూడా బలం చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మునుగోడు భారీ బహిరంగ సభ నిర్వహణతో టిఆర్ఎస్‌ పోటీకి సిద్ధమవుతోంది. శనివారం మునుగోడులో భారీ సభ నిర్వహణకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

<p>మునుగోడులో కోమటిరెడ్డి భారీగా విరాళాలు….</p>
మునుగోడులో కోమటిరెడ్డి భారీగా విరాళాలు….

Munugode by election: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. ఒకవైపు అధికార తెరాస, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు మునుగోడుపై అధిపత్యం కోసం శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గెలుపు తమదంటే తమదనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీలు తమ అభ్యర్ధులపై కొండంత నమ్మకం పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. గత రెండేళ్లుగా జరుగుతున్న ఉప ఎన్నికలతో పాటు ‌ప్రధాన ఎన్నికలు రాక ముందే రాజకీయ నాయకుల పార్టీ మార్పులతో గెలుపొటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస వరుస ఓటములను చవిచూసింది. దీంతో మునుగోడు ఉపఎన్నిక అధికార తెరాసకు కీలకం కానుంది. రాష్ట్రంలో తమ పట్టు చూపించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలో తెరాస వ్యతిరేకతపైనే కాంగ్రెస్‌, బీజేపీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవి దూకుడు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరాస మునుగోడులో దూకుడు పెంచింది. ఉప ఎన్నికల అనివార్యం కావడంతో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహణకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. బహిరంగ సభ నిర్వహణపై ఇప్పటికే మంత్రి జగదీష్‌ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

విస్తృతంగా కోమటిరెడ్డి విరాళాలు….

మరోవైపు గతంలో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ గెలవడంతో ఈ ఉప ఎన్నికలో గెలుపు కూడా తమనే వరిస్తుందనే నమ్మకంతో బీజేపీ పావులు కదుపుతుంది. సొంత పార్టీలో ఇమడలేక మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఖర్చుకు వెరవకుండా, అడిగిన వారిని కాదనకుండా చేతికి ఎముక లేదన్నట్లు కోమటిరెడ్డి ఖర్చు పెడుతున్నారు. లక్షలకు లక్షలు విరాళాలు ఇస్తున్నారు. తన తల్లి సుశీలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున విరాళాలను పంచిపెడుతున్నారు.

మునుగోడు మండలంలోని కొరటికల్లు గ్రామానికి చెందిన దండు బుచ్చయ్యకు లక్ష రుపాయలు, కలవలపల్లి గ్రామానికి చెందిన ఎస్.కె షబ్బీర్ అనే రైతు గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి లక్ష, కలవలపల్లి గ్రామానికి చెందిన ఎస్కే లాలు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి లక్షన్నర, చండూరు మండలం ఉడతల పల్లి గ్రామానికి చెందిన బుషిపాక శీను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురవడంతో మూడు లక్షలు ఇచ్చారు.

నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన దయాకర్ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుబసభ్యులకు రూ.10వేలు, మర్రిగూడ మండలం అంతంపేట గ్రామానికి చెందిన ఆంగోతు సుధాకర్ ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దెబ్బతినడంతో లక్ష రూపాయలు ఇచ్చారు.

మర్రిగూడెం మండలంలోని అజ్జిలాపురం గ్రామానికి చెందిన ఎండి మలైకా బేగం అనారోగ్యంతో మృతి చెందడతో ఇద్దరు పిల్లలకు రెండు లక్షలు, లెంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల కాశమ్మకు రెండు లక్షలు విరాళం ఇచ్చారు. నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న కోమటిరెడ్డి ఎన్నికల్లో ఎటి పరిస్థితుల్లోను గెలవాలని భావిస్తున్నారు.

మరోవైపు పార్టీలన్ని ఓటర్లను కాకాపట్టే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌లో గెలిచిన రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతుండటంతో ఉప ఎన్నిక కాంగ్రెస్‌, బీజేపీకి సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఒక్క ఉప ఎన్నికలో సైతం గెలవని తెరాస ఈ ఎన్నికలో గెలిచి తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక మొదటి ఎన్నిక కావడంతో రేవంత్‌ రెడ్డి గెలుపుకోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్‌లో గెలుపుతో తెలంగాణలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేయాలని భావిస్తోంది.

Whats_app_banner