BJP in munugode: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ఎల్లుండి మునుగోడుకు అమిత్ షా-bjp plans to make munugode public meeting grand success ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp In Munugode: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ఎల్లుండి మునుగోడుకు అమిత్ షా

BJP in munugode: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ఎల్లుండి మునుగోడుకు అమిత్ షా

B.S.Chandra HT Telugu
Aug 19, 2022 11:14 AM IST

BJP in munugode: తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ దూకుడు పెంచింది. ఎల్లుండి మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహణతో తెలంగాణలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మునుగోడు సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

<p>తెలంగాణపై బీజేపీ ఫోకస్</p>
తెలంగాణపై బీజేపీ ఫోకస్

BJP in munugode: మునుగోడు బహిరంగ సభతో తెలంగాణలో అధికార పీఠానికి మార్గం సుగమం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ పూర్తైన తర్వాత అమిత్ షా రోడ్డు మార్గంలో ఫిలిం సిటీ వెళ్లనున్నారు. ఆ తర్వాత నోవాటెల్‌లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు.

తెలంగాణలో పట్టుకోసం బీజేపీ వేగంగా పావులు కదుపుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఉత్సహంగా పనిచేయాలని నేతలకు సూచిస్తున్న బీజేపీ అధిష్టానం 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేరుకోవాలని భావిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో అవలంభించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ని ముమ్మరం చేస్తూ రాష్ట్రంలో ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలతో మంతనాలు సాగిస్తోంది. మునుగోడు సభను దృష్టిలో ఉంచుకొని పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ సభకు హాజరు అవుతుండడంతో తెలంగాణ కమల దళంలోని నేతలు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు.

తెరాస నుంచి కమలం పార్టీలోకి భారీగా చేరికలను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసంతృప్త నేతలందరిని ఓ తాటిపైకి తెచ్చి పార్టీలో చేర్చుకుంటారని చెబుతున్నారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనుండగా, ఇదే సభలో తెరాస నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జరిగిన ఆయన కుమార్తె వివాహ వేడుకల్లో తెరాస నేతలు ఎవరు కనిపించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వేడుకలో ఈటెల కనిపించడంతో పొంగులేటి పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన రాజయ్య యాదవ్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావుతో పాటు పలువురు తెరాసలోని ప్రముఖ నేతలు అమిత్‌ షా సమక్షంలో కాషాయకండువా కప్పుకోనే అవకాశాలు లేకపోలేదు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ తీర్ధం పుచ్చుకుంటారా..? లేదా అనేది అమిత్‌ షా సభ అనంతరం తేలనుంది.

మరోవైపు మునుగోడు బహిరంగ సభ షెడ్యూల్‌‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బహిరంగ సభ తర్వాత షెడ్యూల్ ప్రకారం అమిత్ షా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా ఆయన తిరుగు ప్రయాణంలో ఫిల్మ్‌సిటీలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 6.45 నుంచి 7.30వరకు ఫిల్మ్ సిటీలో బస చేస్తారు. ఆ తర్వాత నోవాటెల్‌ హోటల్లో బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 9.30కు హైదరాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం ఇకపై ప్రతి నెలలో తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది.

Whats_app_banner