TRS Survey : టీఆర్ఎస్ అంతర్గత సర్వేలు.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కష్టమేనట
ఎన్నికలకు ముందు పార్టీలు సర్వేలు నిర్వహించడం కామన్. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ ఎలా ఉండబోతుందనేది తెలుసుకుంటాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ కూడా అంతర్గత సర్వేలు నిర్వహించింది. ఇంతకీ ఆ సర్వేల్లో ఏం తేలింది? ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు?
పార్టీలు నిర్వహించుకునే అంతర్గత సర్వేలతో ప్రజానాడి అర్థమవుతుంది. ప్రభుత్వంపై ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందనేది కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి పార్టీలు. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే.. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందనే విషయంపై ఫోకస్ పెడుతోంది. టీఆర్ఎస్ పార్టీ సైతం అంతర్గత సర్వేలు నిర్వహించింది. పలు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సర్వేలు సూచిస్తున్నాయి. అనేక జిల్లాల్లో నాయకుల మధ్య అంతర్గత పోరు, వివాదాలు, పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్టుగా తెలిసిందట.
ఇటీవల టీఆర్‌ఎస్ చేపట్టిన పలు అంతర్గత సర్వేల్లో రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గతంలో వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో సర్వేలు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రజల్లో అసంతృప్తి తెలిసింది. జిల్లాల్లో పలు నియోజకవర్గాలను బలహీనమైన ప్రాంతాలుగా గుర్తించినట్లు సర్వేల్లో స్పష్టమైనట్టుగా సమాచారం. అయితే కాంగ్రెస్‌లో ఒకే సీటు కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఉండటం లాంటి అంశాలతో వ్యతిరేకత ఉన్నా కొన్నిచోట్ల కలిసొచ్చే అవకాశముందట.
ప్రజల నాడిని అంచనా వేసేందుకు రాజకీయ పార్టీలు అంతర్గత సర్వేలను నిర్వహిస్తాయి. ఇంటెలిజెన్స్ చేసే సర్వేలే కాదు.. అంతర్గత సర్వేలను నిర్వహించడానికి రాజకీయ పార్టీలు బయటి ఏజెన్సీలను ఆశ్రయిస్తాయి. ఈ సర్వేలతోనే.. సమస్యాత్మక నియోజకవర్గాలు, బలహీన ప్రదేశాలను గుర్తించొచ్చు. అక్కడే పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కష్టపడాలి.
గతంలో నియోజకవర్గాల్లో సర్వే చేయగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ నుంచి బాణోత్ శంకర్‌నాయక్‌పై అధికార వ్యతిరేకత పెరుగుతోందని తెలిసింది. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. సర్వేలు.. క్షేత్రస్థాయిలోకి మరి వెళ్లీ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల జాబితాలో తన సోదరుడి పేరు ఉండడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అనుచరులు, బంధువులను లబ్ధిదారులుగా చేర్చుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇది బయటకు రావడం చర్చనీయాంశమైంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను కలిసిన ఫోటోలు కూడా బయటకు రావడంతో ఆ ఎమ్మెల్యే వార్తల్లోకి ఎక్కారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.
గతేడాది హన్మకొండలో దళిత అధికారులపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. 2014లో టీడీపీ టికెట్‌పై గెలిచిన ధర్మారెడ్డి 2018లో మళ్లీ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇకపోతే మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్ కవిత వర్సెస్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఓ సభలో ఎంపీ నుంచి మైక్ లాక్కొన్న అంశం చర్చకు దారి తీసింది.
ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిని సమస్యాత్మక నియోజకవర్గాలుగా టీఆర్ఎస్ పార్టీ గుర్తించినట్టుగా సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, అశ్వారావుపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఎల్లందు నియోజకవర్గాలపైనా.. పార్టీ దృష్టి పెడుతోంది.
రంగారెడ్డి జిల్లాలోనూ అంతర్గత పోరు, ప్రజల్లో అసంతృప్తి పెరిగిన పలు నియోజకవర్గాలను గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట నియోజకవర్గాలు ఇదే జాబితాలో ఉన్నాయి. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి వంటి కొన్ని నియోజకవర్గాలపై అధికార పార్టీ ఫోకస్ పెడుతోంది. కామారెడ్డిలో ఒకే టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అధికార వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డికే అక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయట. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సుమారు 45 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు.
అయితే కేసీఆర్ మళ్లీ మ్యాజిక్ చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారనే అభిప్రాయాలు మాత్రం బలంగా ఉన్నాయి. పార్టీ నేతలు కూడా ఇదే నమ్ముతున్నారు. వివాదాల్లో ఇరుకున్న ఎమ్మెల్యేలు, ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి టికెట్ ఇస్తారా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. కేసీఆర్ నిర్ణయాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. వారికి టికెట్ కష్టమేనట. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు.. వ్యతిరేకత ఉన్నవారిని పక్కకు పెట్టి వేరే వారికి అవకాశం కూడా ఇస్తారనే ప్రచారం ఉంది. కేసీఆర్ సంక్షేమ పథకాలు.. రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాయని టీఆర్ఎస్ చెబుతోంది. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వస్తామంటోంది. బీజేపీ ఎంత పోరాడినా.. అధికారంలోకి మాత్రం రావడం కష్టమేనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.