Munugodu: హస్తం కోటలో ఎగిరిన ఎర్రజెండా... మునుగోడు రాజకీయ చరిత్ర ఇదే-munugode assembly constituency political history ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu: హస్తం కోటలో ఎగిరిన ఎర్రజెండా... మునుగోడు రాజకీయ చరిత్ర ఇదే

Munugodu: హస్తం కోటలో ఎగిరిన ఎర్రజెండా... మునుగోడు రాజకీయ చరిత్ర ఇదే

Mahendra Maheshwaram HT Telugu
Aug 04, 2022 02:16 PM IST

Munugodu bypoll: తెలంగాణ రాజకీయాలు హీట్ ను పెంచేస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కుతకుత ఉడికిపోతుంది. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా పేరున్న మునుగోడు... ఒకనాడు కాంగ్రెస్ అడ్డాగా ఉండగా సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టీఆర్ఎస్ కూడా ఓసారి విజయం సాధించింది.

మునుగోడు రాజకీయ ముఖచిత్రం,
మునుగోడు రాజకీయ ముఖచిత్రం,

munugode assembly constituency: మునుగోడు... ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్..! రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బైపోల్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహలు రచించే పనిలో పడ్డాయి. అస్త్రాలను సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. నియోజకవర్గ ఏర్పాటు నుంచి ఇక్కడ కమ్యూనిస్టులది కీలక పాత్రే..! పలుమార్లు ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బైపోల్ ఖరారైతే... ఎవరి లెక్క ఎలా ఉండబోతుంది..! గత ఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది..! కాంగ్రెస్ అడ్డా… కమ్యూనిస్టుల కోటగా మారిన తర్వాత... టీఆర్ఎస్ అడుగుపెట్టింది. మళ్లీ కాంగ్రెస్ జెండా ఎరిరింది. మరీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ జెండా ఎగరబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మునుగోడు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విక్టరీ కొట్టారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 12 సార్లు ఎలక్షన్స్ జరిగితే... ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ విజయం సాధించాయి. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ పార్టీలే ప్రధానంగా నిలిచాయి. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పేరున్న గోవర్థన్ రెడ్డి... తిరుగులేని విజయాలను అందుకున్నాడు. 1967-1985 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.

ఎగిరిన ఎర్రజెండా....

వరస విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ కు... సీపీఐ బ్రేక్ వేసింది. 1985లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణ రావు... విక్టరీ కొట్టారు. వరసు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలిచారు. కానీ 2004లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి గెలిచారు. ఇక 2009లో సీపీఐ పార్టీ తరపున పోటీ చేసిన ఉజ్జిని యాదగిరి రావు గెలవటంతో మరోసారి కమ్యూనిస్టు జెండా రెపరెపలాడింది.

విభజనతో మారిన సీన్...

ఇక రాష్ట్ర విభజనతో మునుగోడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలిసారిగా విజయాన్ని నమోదు చేసుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టి బంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. మొత్తంగా మునుగోడులో పాల్వాయితో మొదలైన కాంగ్రెస్ విజయయాత్ర... సీపీఐ రాకతో పూర్తిస్థాయిలో బ్రేకులు పడ్డాయి. కానీ మళ్లీ రాజగోపాల్ రెడ్డి విజయంతో తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. పలుమార్లు పొత్తుల్లో భాగంగా... మునుగోడులో కాంగ్రెస్ - సీపీఐ కలిసి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,00,956 ఓట్లు ఉండగా ఇందులో 1,02,801 పురుష ఓట్లు, 98,146 మహిళ ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 48 శాతానికి పైగా ఓట్లు, టీఆర్ఎస్ కు 37.56శాతం ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రం సాధించారు. ఇక కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ దారుణంగా దెబ్బతింది.

గత చరిత్ర చూస్తే... ద్విముఖ పోరుకు మునుగోడు అడ్డగా ఉందన్న సంగతి అర్థమవుతోంది. నాడు కాంగ్రెస్ - సీపీఐల మధ్య పోరు, విభజన తరువాత కాంగ్రెస్ - టీఆర్ఎస్ ల మధ్య అన్నట్లు తయారైంది. 2018లోనూ ఇదే రిపీట్ అయింది. కానీ అనూహ్యంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయటం ఖాయమనుకుంటున్న నేపథ్యంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ఎలాగైనా విజయం నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో... మునుగోడు వార్ గట్టి సవాల్ గా మారనుంది.

IPL_Entry_Point