Double Bedroom Houses : లక్ష 2బీహెచ్‌కేలు కంప్లీట్.. ఎన్నికల కోసమే కేసీఆర్ వెయిట్ చేస్తున్నారా?-is kcr waiting for elections to distribute double bedroom houses to beneficiaries ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Double Bedroom Houses : లక్ష 2బీహెచ్‌కేలు కంప్లీట్.. ఎన్నికల కోసమే కేసీఆర్ వెయిట్ చేస్తున్నారా?

Double Bedroom Houses : లక్ష 2బీహెచ్‌కేలు కంప్లీట్.. ఎన్నికల కోసమే కేసీఆర్ వెయిట్ చేస్తున్నారా?

Anand Sai HT Telugu
Aug 09, 2022 08:22 PM IST

ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఇది కేసీఆర్ మార్క్ స్కీమ్. కానీ చాలామంది.. ఈ పథకంపై ఆశలే పెట్టుకోనట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో లక్షకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తయినట్టు ఉన్నాయి. ఇంకా పంపిణీ మాత్రం జరగలేదు. వీటిపై కేసీఆర్ ఆలోచన ఏంటి? వచ్చే ఎన్నికలకు బ్రహ్మస్త్రమా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు కాలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ జరిగింది. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లలో 18 శాతమే లబ్ధిదారులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇళ్లులేని అర్హులైన కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఎందుకు పంపిణీ చేయలేదు. చాలాప్రాంతాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క 2బీహెచ్‌కే కూడా అందజేయలేదు.

కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కానీ వాటిని పంపిణీ చేయలేదు. వాటిని చూసుకుంటే.. జోగుళాంబ గద్వాల్‌ జిల్లాలో 605 ఇళ్లు నిర్మించి నేటికీ అందజేయలేదు. నాగర్‌కర్నూల్‌-390, ఆదిలాబాద్‌-596, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌-8, పెద్దపల్లి-262, జయశంకర్ భూపాలపల్లి-930, యాదాద్రి-481, మేడ్చల్‌-677 ఇళ్లు ఉన్నాయని ది న్యూస్ మినిట్ తన కథనంలో పేర్కొంది.

అనేక ఇతర జిల్లాల్లో ఇళ్లు సిద్ధంగా ఉన్నా తక్కువ సంఖ్యలో మాత్రమే లబ్ధిదారులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. మెదక్‌లో 2,245 ఇళ్లు సిద్ధంగా ఉండగా.. 128 మందికే అప్పగించారు. కామారెడ్డిలో 4,198 అయిపోగా.. 651 మందికి మాత్రమే ఇచ్చారు. నిజామాబాద్‌లో 2141 ఇళ్లు మంజూరైతే మొత్తం 207 ఇళ్లు నిర్మించగా 1.4 శాతం మాత్రమే అందజేశారు. మంచిర్యాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. 644 ఇళ్లు నిర్మిస్తే.. కేవలం 30 ఇళ్లకే అప్పగించారు. హన్మకొండలో 1424 ఇళ్లకు గానూ 224 మందికి మాత్రమే పంపిణీ జరిగింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మొత్తం నిర్మించిన ఇళ్లలో కేవలం 1 శాతం మాత్రమే అప్పగించారు.

కేసీఆర్ స్వస్థలం సిద్దిపేట, ఖమ్మం వంటి జిల్లాల్లో 30 శాతానికి పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. సిద్దిపేటలో 2బీహెచ్‌కేలు 9,824 నిర్మాణం చేయగా 4,400, ఖమ్మంలో 5,343 ఇళ్లు సిద్ధంగా ఉండగా 3,206 మందికి అందజేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోనూ.. ఇలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ చాలా తక్కువే ఇళ్లే ఇచ్చినట్టుగా సమాచారం. ఇక్కడ ప్రభుత్వం 56,066 ఇళ్లు నిర్మించగా 3,313 ఇళ్లు ఇచ్చింది. జూలై 26, 2022న అందిన ఆర్జీఐ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సంబంధించిన ఈ వివరాలు వెల్లడయ్యాయని ది న్యూస్ మినిట్ పేర్కొంది.

అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఆగి.. ఆగి.. ఎన్నికల సమయంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. ఇంత లేట్ ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొన్నిచోట్లు లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు కూడా ఉన్నాయని వాదనలు ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతుందనే వారు కూడా ఉన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 అక్టోబర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని రూపొందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.2,643 కోట్లు కేటాయించింది. 2020-2021 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.11,917 కోట్లు కేటాయింపులు జరిగాయి. మార్చి 2022లో తెలంగాణ ప్రభుత్వం కొత్త డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని కింద ప్లాట్లు కలిగి ఉన్నవారికి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారికి ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల చొప్పున నాలుగు లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తామని తెలిపింది.

తెలంగాణ బడ్జేట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇల్లు కట్టుకునే పేదలకు మూడు లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు. సొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి ఏకంగా మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న నాలుగు లక్షల మందికి మూడు లక్షల రూపాయలను అందించనున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు.

మరోవైపు జులై నెలలో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్ష చేశారు. ఇప్పటికే భాగ్య నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కు చెప్పారు. 60 వేల ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు అన్నారు. అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలన్నారు కేటీఆర్. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొవాలని సూచించారు. వెంటనే ఈ పని పూర్తయి పోవాలన్నారు. అయితే మార్గదర్శకాలు రూపొందించే సమయంలో ప్రభుత్వం దగ్గర ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ప్రామాణికంగా తీసుకోవాలని సూచనలు చేశారు.

IPL_Entry_Point