KCR On Munugode : మునుగోడుపై కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా?-cm kcr serious focus on munugode by election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Serious Focus On Munugode By Election

KCR On Munugode : మునుగోడుపై కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా?

Anand Sai HT Telugu
Aug 15, 2022 02:30 PM IST

మునుగోడును పార్టీలన్నీ చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అస్త్రశస్త్రాలు ప్రయోగించి.. ఎలాగైనా బైపోల్ కొట్టాలని చూస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎప్పుడూ లేని విధంగా గులాబీ బాస్ కూడా.. నోటిఫికేషన్ రాకముందే మునుగోడులో అడుగుపెట్టనున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

మునుగోడు వార్ మెుదలైంది. పార్టీలన్నీ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. ఎలాగైనా ఉపఎన్నిక గెలిచి.. వచ్చే ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తున్నాయి. సెమీ ఫైనల్ గా భావించే ఈ ఎన్నికలను సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే.. కేసీఆర్ మునుగోడు పర్యటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్ట్‌ 20న మునుగోడు ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చేందుకు నియోజకవర్గానికి రానున్నారు. ఏ ఎన్నికకు ఇలా కేసీఆర్ నోటిఫికేషన్ రాకముందు వెళ్లలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఈ ఉపఎన్నికను కేసీఆర్ ఎంత సీరియస్ గా తీసుకున్ననారో అర్థం చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారం చేపట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్‌లలో చేయలేదు.

హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. నాగార్జునసాగర్‌ కూడా అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లింది. దుబ్బాక, హుజూరాబాద్‌లను టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ సొంతం చేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కేసీఆర్.. ఇక్కడ దృష్టి పెట్టారు. ఉపఎన్నికలో గెలిచి వచ్చే ఎన్నికల్లో తమపై వ్యతిరేకత లేదని.. తెలంగాణ ప్రజలకు చూపించాలని కేసీఆర్ అనుకుంటున్నారు.

మునుగోడులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై దృష్టి పెట్టాలని నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జగదీశ్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్. యుద్దప్రాతిపదికన ఉపఎన్నికకు ముందు నెరవేర్చగలిగే విషయాలపై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినట్టుగా సమాచారం.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో మునుగోడు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పటికే అధికార పార్టీకి నివేదికలు వెళ్లాయి. దశాబ్దాలుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడం పట్ల ప్రజలు ఆవేదనతో ఉన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్లను ఎన్నికలకు ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. కానీ ఎన్నికలు అయిపోయాక మర్చిపోతున్నారు. ఏ పార్టీ కూడా నెరవేర్చలేకపోయిందని ప్రజలు చెబుతున్నారు.

ఆరు పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేరు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన ఒక్క వైద్యుడే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఇద్దరు వైద్యులు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మునుగోడులోని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు నల్గొండ పట్టణం వరకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సదుపాయం లేక కొంతమంది చదువుకు దూరం అవుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.

ఆగస్టు 20న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వీటిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే రోజు కళాశాలలు, ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన జీఓ విడుదల చేస్తామని నల్గొండ పార్టీ నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మరిన్ని వరాల జల్లు కురిపించే ఛాన్స్ ఉంది.

IPL_Entry_Point