TRS: ఆయనకు టికెట్ ఇవ్వొద్దు.. మునుగోడు టీఆర్ఎస్ లో రచ్చ!-internal conflicts in munugodu trs over by poll candidate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs: ఆయనకు టికెట్ ఇవ్వొద్దు.. మునుగోడు టీఆర్ఎస్ లో రచ్చ!

TRS: ఆయనకు టికెట్ ఇవ్వొద్దు.. మునుగోడు టీఆర్ఎస్ లో రచ్చ!

Mahendra Maheshwaram HT Telugu
Aug 13, 2022 10:13 AM IST

మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. ఉప ఎన్నిక అభ్యర్థిపై లీక్ లు వస్తున్న క్రమంలో… పార్టీలో అసమ్మతి రాగం బలపడుతోంది.

మునుగోడు బైపోల్ 2022
మునుగోడు బైపోల్ 2022

Munugodu TRS: మునుగోడు.... ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల టార్గెట్...! ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రం టగ్ ఆఫ్ వార్ లా మారింది. ఏ మాత్రం తలకిందులైనా.... ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అన్న భయ ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పాదయాత్రలు, సభలు, విస్తృతస్థాయి సమావేశాలతో బిజీబిజీ అవుతున్నాయి. అభ్యర్థి విషయంలో బీజేపీ వైపు నుంచి క్లారిటీ ఉండగా... కాంగ్రెస్, టీఆర్ఎస్ లను మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. పరిస్థితులపై ఆరా తీస్తూ... పలు సూచనలు కూడా చేశారు. ఇంకో అడుగు ముందుకేసి.... సభను కూడా ప్లాన్ చేశారు. అది కూడా లక్ష మందితో...! అయితే ఇదే క్రమంలో.... పార్టీ అభ్యర్థిపై కూడా లీక్ లు ఇస్తోంది టీఆర్ఎస్. గత ఎన్నికల్లో ఓడిపోయిన కూసుకుంట్లకే టికెట్ అన్న వార్తలు వస్తున్నాయి. తెరపై కనపడుతున్న పరిణామాలు.... కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. సీన్ కట్ చేస్తే ఈ పరిణామాలే.... పార్టీలో అసమ్మతి రాగాన్ని బలపరుస్తున్నాయి.

వ్యతిరేక భేటీ...!

ఇదిలా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఈసారి టికెట్‌ ఇవ్వొదంటూ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు గతంలో మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి రెండు రోజుల కిందటే నియోజకవర్గానికి చెందిన ఆయా నేతలందరిని పిలిపించుకొని వారితో చర్చించారు. అంతర్గత కుమ్ములాటలు వద్దని, పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారికోసం అంతా పనిచేయాలని స్పష్టం చేశారు. ఇది జరిగి రెండు రోజులు గడవకముందే శుక్రవారం చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ గెలవదని... ఓడిపోవటం పక్కా అని స్పష్టం చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే కలిసి పని చేయమని చెప్పారు. పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటామని... కానీ కూసుకుంట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినాయకత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు.

మరోవైపు ఈనెల 20వ తేదీన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే వేదిక ఎక్కడ అనేది దానిపై కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డి... కూసుకుంట్లతో కలిసి చౌటుప్పల్, నారాయణపూర్, మునుగోడు మండలాల పరిధిలో పరిశీలన చేశారు.

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఓ క్లారిటీతోనే పని చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ తలపెట్టే సభలోనే ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. అనుకున్నట్లు కూసుకుంట్లకే టికెట్ వస్తే… ఆయన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారనుంది.

IPL_Entry_Point