Ganguly on Virat Kohli: కోహ్లి ఓపెనింగ్ రావాలి.. ఈ టీమ్ వరల్డ్ కప్ గెలుస్తుంది: సౌరవ్ గంగూలీ
Ganguly on Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేయాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ జట్టుకు వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్నదని కూడా అతడు స్పష్టం చేశాడు.
Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ దింపితేనే మంచిదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో కోహ్లి టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అతడు సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో మూడో స్థానంలో వచ్చినా.. ఐపీఎల్లో మాత్రం ఓపెనర్ గా వచ్చిన సక్సెస్ అవుతున్నాడు.
కోహ్లి ఓపెనింగ్ రావాలి: గంగూలీ
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఇండియన్ టీమ్ ను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలుసు కదా. ఇందులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరికీ చోటు దక్కింది. అయితే ఈ ఇద్దరే ఓపెనింగ్ వస్తారా? లేక కోహ్లి తన రెగ్యులర్ మూడో స్థానంలో దిగుతాడా అన్నది తెలియలేదు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం కోహ్లి కచ్చితంగా ఓపెనింగే రావాలని అంటున్నాడు.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు ఆడిన తీరు చూసిన తర్వాత గంగూలీ ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు. "విరాట్ అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో అతడు ఆడిన తీరు, 92 పరుగులు చాలా వేగం చేయడం చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో అతన్ని ఓపెనర్ గా ఉపయోగించుకోవాలి. అతడు ఓపెనింగ్ చేయాల్సిందే అని గత కొన్ని ఐపీఎల్ ఇన్నింగ్స్ ద్వారా అతడు నిరూపించాడు" అని గంగూలీ అన్నాడు.
బెంగళూరులో శుక్రవారం (మే 10) పీటీఐతో మాట్లాడిన గంగూలీ కోహ్లితోపాటు టీ20 వరల్డ్ కప్ జట్టుపైనా స్పందించాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లి 47 బంతుల్లోనే 92 రన్స్ చేసి స్ట్రైక్ రేట్ విమర్శలకు కూడా సమాధానమిచ్చాడు. దీంతో ఈ మ్యాచ్ లో 60 పరుగులతో గెలిచిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఇదే బెస్ట్ టీమ్: గంగూలీ
ఇక టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టుపై గంగూలీ స్పందించాడు. ఇదే బెస్ట్ టీమ్ అని అతడు స్పష్టం చేశాడు. "ఇది అద్భుతమైన జట్టు. సాధ్యమైనంత వరకు బెస్ట్ టీమ్ ఎంపిక చేశారు. బ్యాటింగ్ లోతుగా ఉండటంతోపాటు బౌలింగ్ కూడా బాగుంది. ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్. కుల్దీప్, అక్షర్, సిరాజ్ ల రూపంలో అనుభవం కూడా ఉంది. ఈ సమయంలో మనకు ఉన్న బెస్ట్ కాంబినేషన్ ఇదే" అని గంగూలీ అన్నాడు.
జూన్ 2 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే అతడు ఇండియా తరఫున 117 టీ20ల్లో 4037 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు అతనివే. అందులో 9సార్లు ఓపెనింగ్ చేశాడు. 57.14 సగటుతో 400 రన్స్ చేయడం విశేషం. ఈ ఫార్మాట్లో అతడు చేసిన ఏకైక సెంచరీ కూడా ఓపెనర్ గా చేసినదే. 2022 ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై ఈ సెంచరీ చేశాడు.